అహ్మదాబాద్ విమానం ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో విడుదల చేసిన ప్రాథమిక నివేదికపై ఎయిరిండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ స్పందించారు.
ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఏఏఐబీ) ప్రస్తుతం ఎలాంటి కారణాలను గుర్తించలేదని, ఎలాంటి సిఫారసులు చేయలేదని వివరించారు. ప్రాథమిక నివేదిక ఆధారంగా ఇప్పుడే తుది నిర్ణయానికి రావద్దని విజ్ఞప్తి చేశారు.
”విమానంలో కానీ, ఇంజన్ విషయంలో కానీ ఎలాంటి మెకానికల్, మెయింటెనెన్స్ సమస్యలు కనిపించలేదని ప్రాథమిక నివేదిక నిర్ధారించింది.
ఇంధన నాణ్యతలో లోపం కనిపించలేదు. టేకాఫ్ సమయంలో ఎలాంటి అసాధారణ పరిస్థితులు లేవు. ప్రయాణానికి ముందు పైలట్లు బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో పాస్యయారు. ఆరోగ్య పరిస్థితిలో కూడా లేపాలు లేవు’ అని విల్సన్ తెలిపారు.
కాగా, ఏఏఐబీ ప్రాథమిక నివేదికపై ఎయిర్‌లైన్స్ పైలెట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసింది.
నివేదికలో పక్షపాత వైఖరి కనిపిస్తోందని, పైలట్ల తప్పిదం ఉందనే అర్థం వచ్చేలా ఉందని అసోసియేషన్ పేర్కొంది. దర్యాప్తులో తమను కూడా భాగం చేయాలని కోరింది.
అయితే, ప్రాథమిక దర్యాప్తు నివేదికే తుది నివేదిక కాదని, దీని ఆధారంగా ఒక నిర్ధారణకు రావద్దని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు కోరారు.
ప్రపంచంలోని ప్రతిభావంతులైన పైలెట్లు మనకు ఉన్నారని, విమానయాన శాఖకు వారు వెన్నెముక అని, వారి సేవలు శ్లాఘనీయమని ప్రశంసించారు.


