పులివెందుల శాసనసభ్యుడు జగన్ రెడ్డి మానసిక పరిస్థితి సరిగా లేదని, ఆయన గంజాయి బ్యాచ్, ఉన్మాదులు, బెట్టింగులకు పాల్పడే నేరగాళ్లతో సమావేశమవుతున్నారని రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు & రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొంటే జగన్ రెడ్డిలో ఉన్న ఫ్రస్ట్రేషన్ కొంతైనా తగ్గుతుందని ఆయన హితవు పలికారు.
అల్లర్లు సృష్టించడం మానుకుని యోగాసనాలు వేస్తే మానసిక పరిస్థితి మెరుగుపడుతుందని మంత్రి సూచించారు.
ఫ్రస్ట్రేషన్‌లో జగన్ రెడ్డి ఏది పడితే అది మాట్లాడుతున్నారని, “చంపేస్తాం, నరికేస్తాం” అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న వైసీపీలోని కొందరు సైకోల చేష్టలను వ్యతిరేకించాల్సింది పోయి, చిరునవ్వుతో స్వాగతిస్తున్నారని అనగాని ఆరోపించారు.
నెలకు ఒకరోజు ప్రజల్లోకి వచ్చి నానా బీభత్సం సృష్టించి, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు.
తెనాలికి వెళ్లి గంజాయి బ్యాచ్‌ను పరామర్శించడం, ఏడాది క్రితం చనిపోయిన వారిని ఇప్పుడు పరామర్శించడం వంటి పనులు చేస్తున్నారని, ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు.
తన వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడి మరణిస్తున్నా పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో ఉండే రోగులకు ఉండే లక్షణాలన్నీ జగన్‌లో కనిపిస్తున్నాయని అనగాని సత్యప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
2024 ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుతో జగన్ రెడ్డి మానసిక స్థితి దెబ్బతిన్నదని ఆయన అభిప్రాయపడ్డారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో యావత్ ప్రపంచం మన వైపు చూసేలా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వైజాగ్‌లో ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి గుర్తుచేశారు.
జగన్ రెడ్డి ఇప్పటికైనా మించిపోయింది లేదని, వెంటనే యోగాంధ్రలో పాల్గొంటే ఆయన అసహనం కాస్తయినా తగ్గి, ఇలాంటి పిచ్చి చేష్టలు మానుకుంటారని ఆశిస్తున్నట్లు అనగాని సత్యప్రసాద్ తెలిపారు.