జమ్మూకాశ్మీర్ లో అత్యవసర పరిస్థితులను తలపించే సందర్భం నెలకొన్న విషయం తెలిసిందే. దీనితో ఇటు భారత్‌తో పాటు అటు పాక్ సరిహద్దు ప్రాంతాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అలాగే బలగాల మొహరింపు నేపథ్యంలో వస్తున్న వదంతుల వల్ల పాక్ ప్రభుత్వం సైతం కశ్మీర్ వైపు నిఘా వేసి ఉంచింది. ఒకవేళ అధికరణ 35ఏ, 370 రద్దు చేస్తే.. కష్ట కాలం తప్పదని పాక్ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ ‘జాతీయ భద్రతా కమిటీ'(ఎన్‌ఎస్‌సీ)తో భేటీ కానున్నారు. నియంత్రణా రేఖ వెంబడి భారత్ క్లస్టర్ బాంబులను ఉపయోగిస్తుందన్న ఆ దేశ సైనికవిభాగం ఆరోపణలపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కశ్మీర్, పీవోకే, నియంత్రణా రేఖ వెంబడి పరిస్థితులపై విస్తృత స్థాయిలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి సైనిక ఉన్నతాధికారులు సహా రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరవనున్నట్లు సమాచారం. భారత సైన్యం నియంత్రణ రేఖ వెంబడి క్లస్టర్ బాంబుల్ని ఉపయోగిస్తోందంటూ పాక్ ఆరోపించింది. దీన్ని భారత సైన్యం తిప్పికొట్టింది. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని భారత్ క్లస్టర్ మందుగుండును ఉపయోగిస్తోందని పాక్ విదేశాంగమంత్రి షా మహమూద్ ఖురేషి శనివారం ట్విటర్ వేదికగా ఆరోపించారు. పాక్ మంత్రి పోస్ట్ చేసిన చిత్రాలు మోర్టారు కాల్పులకు సంబంధించినవని, క్లస్టర్ బాంబు పేలుళ్లవి కాదని భారత సైనిక వర్గాలు పేర్కొన్నాయి.