ఒకవైపు బాలీవుడ్, మరోవైపు కన్నడ చిత్రసీమలో డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. కన్నడ నటీమణులు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ అరెస్ట్ తర్వాత డ్రగ్స్ ఇష్యూ ఊహించని మలుపులు తిరుగుతోంది. తాజాగా కన్నడ పాపులర్ యాంకర్ అనుశ్రీకి నోటీసులు పంపారు మంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు. డ్రగ్స్ రవాణా కేసులో ఇటీవలే డ్యాన్సర్ కిశోర్శెట్టిని మంగళూరు పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ విచారణలో కిశోర్శెట్టి ఇచ్చిన సమాచారం మేరకు యాంకర్ అనుశ్రీకి సీసీబీ అధికారులు నోటీసులు పంపినట్లు కన్నడ మీడియా వర్గాల సమాచారం. గతంలో పలు పార్టీల్లో అనుశ్రీ డ్రగ్స్ తీసుకుందని కిషోర్ చెప్పినట్లు తెలుస్తోంది. ఊహించని విధంగా పాపులర్ యాంకర్ పేరు బయటకురావడంతో ఈ డ్రగ్స్ బాగోతం మరిన్ని మలుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా డ్యాన్సర్ కిశోర్శెట్టితో ప్రస్తుతం తనకు కాంటాక్ట్స్ లేవని, ఎప్పుడో పదేళ్ల క్రిందట కిశోర్శెట్టితో కలిసి డ్యాన్స్ చేశానంతే అంటూ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించింది అనుశ్రీ. ఇక బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా పదుకొనే, శ్రద్దా కపూర్, సారా అలీఖాన్, టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకున్న విషయం తెలిసిందే.
previous post

