ముంబై మహానగరంలో నిన్న ఉదయం నుంచి కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు ఇప్పటికే నీటమునిగాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముంబై, రత్నగిరి, రాయ్‌గఢ్, పాల్‌గఢ్, థానేలలో నేడు కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) ముంబైకి రెడ్ అలర్ట్ ప్రకటించింది. శనివారం కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
శుక్రవారం కురిసిన వర్షాలకే ముంబై అతలాకుతలమైంది. ఏకధాటిగా మూడు గంటలపాటు కుండపోత వాన పడటంతో 157 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముంబైలో నిన్న ఉదయం కురిసిన వర్షానికి దాదర్, మాతుంగా, వర్లినాకా, లాల్‌బాగ్, కింగ్స్ సర్కిల్, సియోన్, కుర్లా, అంధేరీ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. అంతేకాకుండా హింద్‌మాతా, గోల్డ్ ఈవల్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాలో చెట్లు విరిగి విద్యుత్ స్తంభాలపై కూలడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది.