ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో అటు ప్రభుత్వం ఇటు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఏపీ గవర్నర్ కార్యాలయం రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులు ఇప్పటికే కరోనా బారినపడినట్టు వార్తలు రాగా, తాజాగా ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పేషీలో పనిచేస్తున్న అటెండర్ కూడా కరోనా బారినపడ్డాడు.మంగళవారం అతడికి నిర్వహించిన ట్రూనాట్ పరీక్షల్లో ప్రిజంప్టివ్ పాజిటివ్ రావడం కలకలం రేపింది.
దీంతో నిర్ధారించుకునేందుకు ఆ శాంపిల్‌ను వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. బాధిత అటెండర్‌ను పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలకు పంపారు. విషయం తెలిసిన వెంటనే నాని, ఆయన భద్రతా సిబ్బందితోపాటు పేషీలోని అధికారులు, ఉద్యోగులు కలిపి మొత్తం 12 మందిని పరీక్షించారు. వీరికి సంబంధించిన పరీక్ష ఫలితాలు గత అర్ధరాత్రి రాగా, అందరికీ నెగటివ్ అని తేలినట్టు వైరాలజీ ల్యాబ్ అధికారులు తెలిపారు.

