ఐరాస భద్రతా మండలి ఉత్తర కొరియాపై విధించిన ఆంక్షలను వెంటనే తొలగించాలని చైనా-రష్యాలు విజ్ఞప్తి చేశాయి.ఉత్తర కొరియా బగ్గు, ఇనుము, ఇనుప ఖనిజం, వస్త్రాల ఎగుమతులపై ఆంక్షలను తొలగించటం కీలకమని ఈ రెండు దేశాలు ఒక ముసాయిదా తీర్మానంలో పేర్కొన్నాయి. ఈ తీర్మానాన్ని సోమవారం నాడు మండలి సభ్యదేశాలకు అందచేశాయి. దీనితో పాటు ఇతర దేశాలలోని ఉత్తర కొరియన్లు తమ మాతృదేశానికి నగదు పంపటంపై వున్న ఆంక్షలను కూడా తొలగించాలని కోరాయి. అణుదౌత్యానికి కొత్త ప్రతిపాదనలతో వచ్చేందుకు ఉత్తర కొరియా అధినేత కిమ్‌జోంగ్ ఉన్ అమెరికాకు నిర్దేశించిన గడువులోగా చర్చల పున్ణప్రారంభానికి అవసరమైన మార్గాలను అన్వేషించేందుకు తాము ఈ ప్రతిపాదనలు చేస్తున్నట్లు ఈ రెండు దేశాలు తమ ముసాయిదా పత్రంలో పేర్కొన్నాయి.
గత ఫిబ్రవరిలో ట్రంప్‌తో మలి భేటీ ముగిసిన తరువాత అమెరికా, ఉత్తర కొరియాల మధ్య అణు చర్చలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అమెరికా-ఉత్తర కొరియా మధ్య చర్చల పున్ణప్రారంభాన్ని తాము స్వాగతిస్తామని, కొరియన్ ద్వీపకల్పంలో కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతలకు తెరదించేందుకు తదుపరి కార్యాచరణపై అన్ని వర్గాలు దృష్టి సారించాలని రెండు దేశాలు విజ్ఞప్తి చేశాయి.

