telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రెగ్నెసీ టెస్ట్‌ చేయించుకోమన్నారు… “బిగ్ బాస్”పై హేమ సంచలన వ్యాఖ్యలు

Hema

స్టార్‌ మాలో ప్రసారమయ్యే రియాలిటీ షో ‘బిగ్‌ బాస్‌ 3’ నుండి తొలి వారంలో హేమ ఎలిమినేట్‌ అయ్యారు. షోలో తన ప్రయాణం గురించి మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో హేమ విలేకరులతో మాట్లాడుతూ “నేను చాలా సెన్సిటివ్‌ పర్సన్‌. ‘బిగ్‌ బాస్‌’ ఇంటిలో ఉన్నవాళ్లందరూ నాకంటే వయసులో పదేళ్లు చిన్నవాళ్లు. వాళ్లను నేను తిట్టలేను. తిట్టించుకోలేను. తిడితే ‘హేమ చిన్నవాళ్లను తిట్టింద’ని అంటారు. తిట్టించుకుంటే ‘చిన్నవాళ్ల చేతిలో తిట్లు తింద’ని అంటారు. ఒకానొక దశలో ఇంటి నుండి బయటకు వచ్చేయడమే మంచిదనుకున్నా. ఇంటిలో సభ్యులు నన్ను అర్థం చేసుకోలేకపోయారు. షోలో నేను నటించలేదు. నేను నేనులా ఉన్నాను. ఒకవేళ ఇతర సభ్యుల్లా నేనూ నటించి ఉంటే ఇంకొన్ని రోజులు ఇంటిలో ఉండేదాన్నేమో. ఓటింగ్‌ విధానం కూడా నా ఎలిమినేషన్‌కు కారణమైంది. గూగుల్‌లో పోలైన ఓట్లలో చూస్తే… నేనే టాప్‌లో ఉన్నాను. కానీ గత సీజన్స్‌లో గూగుల్‌ ఓటింగ్‌లో అవతవకలు జరగడంతో ఈసారి హాట్‌స్టార్‌ యాప్‌లో ఓట్లు వేయాలన్నారు. నన్ను అభిమానించే గ్రామీణ ప్రజలకు హాట్‌స్టార్‌ అవీ ఇవీ అర్థం కాలేదు. శ్రీముఖి, వితికా షేరు ద్వంద ధోరణితో వ్యవహరించారు. ఈ షో వల్ల నా ఇమేజ్‌కు డ్యామేజ్‌ ఏం జరగలేదు” అని తెలిపారు.

‘బిగ్‌ బాస్‌’ షో చుట్టూ ముసురుకున్న వివాదాలపై హేమ స్పందిస్తూ ‘‘నాకు నాగార్జునగారు ఇష్టం. ఆయన మీద నేను దృష్టి పెట్టాను. కొంతమందికి వివాదాలంటే ఇష్టం. వాటి మీద వారు దృష్టి పెట్టారు. ఆ అమ్మాయి (శ్వేతారెడ్డి)ది తప్పని అనను. అయితే… దొంగలు పడిన ఆర్నెల్లకు అన్నట్టుంది ఆమె వ్యవహారం. తప్పు జరిగితే ఫైట్‌ చేయాల్సిందే. ‘బిగ్‌ బాస్‌’ సెలక్షన్స్‌ టైమ్‌లో నన్ను ప్రెగ్నెసీ టెస్ట్‌ చేయించుకోమన్నారు. నేను చేయించుకుని రిపోర్ట్స్‌ ఇచ్చాను. అందులో తప్పేముంది? నాకు పెళ్లైంది. ఒకవేళ నేను ప్రెగ్నెంట్‌ అయితే ఇతర సభ్యులకు తెలియదు కదా! గేమ్‌లో భాగంగా నేను కిందపడి అబార్షన్‌ అయితే ‘బిగ్‌ బాస్‌’ వాళ్లనే అంటారు కదా’’ అన్నారు. “ప్రస్తుతం మా అమ్మాయి బీబీఏ రెండో సంవత్సరం చదువుతోంది. తన చదువు పూర్తయ్యాక, తనకు ఇంటి బాధ్యతలు అప్పగించాక… రాజకీయాల్లోకి వెళతా. ఈలోపు ఇంకా తినాల్సిన దెబ్బలు చాలా ఉన్నాయి” అంటూ చెప్పుకొచ్చింది హేమ.

Related posts