ఉస్మానియా యూనివర్సిటీ (OU)లో చేపట్టనున్న అభివృద్ధి పనుల్లో విద్యార్థులు, బోధన సిబ్బంది అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు.
ఓయూ అభివృద్ధి పనులకు సంబంధించి ఎంత మొత్తమైనా ఖర్చు చేసేందుకు వెనుకాడమని తెలిపారు.
ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
యూనివర్సిటీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై తొలుత అధికారులు వివరించారు. అనంతరం పనులకు సంబంధించిన వివిధ మోడళ్ల పవర్ పాయింట్ ప్రజంటేషన్స్‌ను ముఖ్యమంత్రి వీక్షించారు.
హాస్టల్ భవనాలు, రహదారులు, అకడమిక్ బ్లాక్స్, ఆడిటోరియం నిర్మాణాలకు సంబంధించి పలు మార్పులు చేర్పులను సూచించారు.
యూనివర్సిటీ పరిధిలోని అటవీ ప్రాంతంలో పనులకు అర్బన్ ఫారెస్ట్రీ నిధులు వినియోగించే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు.
యూనివర్సిటీ పరిధిలో ఇప్పటికే ఉన్న జల వనరులను సంరక్షిస్తూనే నూతన జల వనరుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
హాస్టల్, అకడమిక్ భవనాల నిర్మాణం విషయంలో వంద మంది విద్యార్థులుంటే అదనంగా మరో పది శాతం విద్యార్థులకు వసతులు ఉండేలా చూడాలని తెలిపారు.
విద్యార్థులు, సిబ్బంది భవిష్యత్తులోనూ ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా నిర్మాణాలు ఉండాలని సీఎం అన్నారు.
యూనివర్సిటీ పరిధిలోని చారిత్రక, వారసత్వ భవనాలను సంరక్షించాలని చెప్పారు. చారిత్రక ప్రాధాన్యం లేని పురాతన భవనాలకు భారీ మొత్తాలు వెచ్చించి మరమ్మతులు చేసే బదులు నూతన భవనాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
సైకిల్ ట్రాక్‌లు, వాకింగ్ పాత్లతో పాటు ప్రతి పనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు. ఉస్మానియా విద్యార్థుల పోరాట ప్రతిమను ప్రతిబింబించే చిహ్నాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ నెల 10 ఓయూను సందర్శించనున్నట్లు ముఖ్యమంత్రి గారు చెప్పారు. ప్రధానంగా అకడమిక్ బ్లాక్‌లు, హాస్టళ్లను పరిశీలిస్తానని చెప్పారు.
యూనివర్సిటీ అభివృద్ది పనుల విషయంలో విద్యార్థులు, బోధనా సిబ్బంది అభిప్రాయాలు స్వీకరించాలని పేర్కొన్నారు.
తొలుత అభివృద్ధి నమూనాలు వారి ముందు ఉంచాలని తర్వాత వారి అభిప్రాయాలు తెలిపేందుకు డ్రాప్ బాక్స్‌లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.
వారి అభిప్రాయాలకు ప్రాధాన్యమిస్తూ ఈ నెలాఖరు నాటికి అభివృద్ధి ప్రణాళికలపై తుది నిర్ణయం ఖరారు కావాలని తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు , ఓయూ వైస్ చాన్సెలర్ ప్రొఫెసర్ మొలుగురం కుమార్ , ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీం తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

