telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు ఉద్యోగాలు రాజకీయ వార్తలు

ఆంధ్రప్రదేశ్ లో హిందూజాగ్రూప్‌తో రూ.20,000 కోట్ల విలువైన పెట్టుబడులకు ఎంవోయూ: ముఖ్యమంత్రి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, ఇంధన రంగాల అభివృద్ధికి ఊతమిచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది.

ప్రముఖ పారిశ్రామిక సంస్థ హిందూజా గ్రూప్‌తో రూ.20,000 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్ నుంచి ప్రకటించారు.

ఈ ఒప్పందంతో రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతితో పాటు స్వచ్ఛ ఇంధన వనరుల అభివృద్ధి వేగవంతం కానుంది.

ఈ ఒప్పంద కార్యక్రమంలో హిందూజా గ్రూప్ ఛైర్మన్ అశోక్ పి. హిందూజా, హిందూజా గ్రూప్ యూరప్ ఛైర్మన్ ప్రకాశ్ హిందూజా, హిందూజా ఇన్వెస్ట్‌మెంట్స్ సీఈవో వివేక్ నందాతో చర్చలు జరపడం ఆనందంగా ఉందని చంద్రబాబు తెలిపారు.

ఈ పరివర్తనాత్మక భాగస్వామ్యం రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

విశాఖపట్నంలో ఇప్పటికే ఉన్న 1,050 మెగావాట్ల హెచ్‌ఎన్‌పీసీఎల్ ప్లాంట్ సామర్థ్యాన్ని అదనంగా మరో 1,600 మెగావాట్లు (2×800 మెగావాట్లు) పెంచనున్నారు.

పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడమే ఈ విస్తరణ ముఖ్య ఉద్దేశం.

రాయలసీమ ప్రాంతంలో భారీ సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరగనుంది.

కృష్ణా జిల్లా మల్లవల్లిలో అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులు, తేలికపాటి వాహనాల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తారు. ఇది పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించడానికి దోహదపడుతుంది.

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్ల నెట్‌వర్క్‌ను హిందూజా గ్రూప్ ఏర్పాటు చేయనుంది.

ఈ భారీ పెట్టుబడులతో రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణం మరింత మెరుగుపడటంతో పాటు, స్థానికంగా వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Related posts