శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రైవేటు వ్యక్తుల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం కారణంగానే ఇంత పెద్ద ప్రాణనష్టం జరగడం అత్యంత బాధాకరమని అన్నారు.
ఈ దుర్ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
శనివారం శ్రీ సత్యసాయి జిల్లా పెద్దన్నవారిపల్లిలో ‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు.
అనంతరం జరిగిన ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడుతూ కాశీబుగ్గ ఘటనను ప్రస్తావించారు.
అంత పెద్ద తుపానులో ముందస్తు ప్రణాళిక ద్వారా ఎక్కువ ప్రాణ నష్టం లేకుండా చూడగలిగామని తీరా చూస్తే ఈరోజు ప్రైవేటు వ్యక్తుల బాధ్యతా రాహిత్య చర్యలతో ఇంత పెద్ద ప్రాణనష్టం జరిగిందని ఇది అత్యంత బాధాకరమని అన్నారు.
కాగా, ప్రజావేదిక సభ వేదికగా కాశీబుగ్గ మృతులకు సంతాపంగా రెండు నిముషాల పాటు మౌనం పాటించారు.
ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఈ దుర్ఘటనలో 9 మంది భక్తులు మరణించారని, మరో 13 మంది గాయపడ్డారని ప్రభుత్వం ధృవీకరించింది.
మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున తక్షణ ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది.

