ఖమ్మం జిల్లాలో ఒక వ్యక్తి ఆన్‌లైన్ లో చెప్పులు కొంటే రూ.1,21,000లు మాయం అయ్యాయి. ఈ ఘటనపై ఖమ్మం సైబర్ క్రైంస్టేషన్‌లో ఫిర్యాదు నమోదు కాగా.. పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలపరిధిలోని వీయంబంజరుకు చెందిన చిట్లూరి సత్యనారాయణ ఈ నెల 21న స్నాప్‌డీల్ యాప్ ద్వారా రూ.799ల విలువ గల చెప్పులను బుక్ చేశాడు. అవి 26న డెలివరీ అయ్యాయి. ఆ చెప్పులు నచ్చలేదంటూ రిటర్న్ చేస్తానని సంబంధిత పార్సిల్‌పై ఉన్న ఫోన్ నెంబరుకు ఫిర్యాదు చేశాడు. పది నిమిషాల అనంతరం బాధితుడు సత్యనారాయణకు ఫోన్‌లో లింకు వస్తుందని, దానికి రిప్లే ఇస్తే చెప్పుల నగదు మీ అకౌంట్‌లోకి తిరిగి వస్తాయని అపరిచిత వ్యక్తులు సూచించారు.
సత్యనారాయణ తన ఫోన్‌కు వచ్చిన లింకును మళ్ళీ అదే ఫోన్‌కు పంపించాడు. అంతే వెంటవెంటనే విడతలవారీగా లక్షా ఇరవైవేలు మాయం. దీనిపై ఆ బ్యాంకు మేనేజర్ ని సంప్రదించగా, అది సైబర్ క్రైమ్ అని, సంబంధిత స్టేషన్ లో పిర్యాదు చేయాలనీ, ఏటీఎం మాత్రమే లాక్ చేసే అధికారం తనకుందని మేనేజర్ తెలిపినట్లు బాధితుడు సత్యనారాయణ తెలిపారు. ఆన్‌లైన్‌లో చెప్పులు కొన్న పాపానికి తన అకౌంట్‌లో నుంచి రూ.1,21,993లు పొగొట్టుకోవాల్సి వచ్చిందని బాధితుడు వాపోయాడు. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తే ఇలాంటి మోసాలు జరుగుతాయని, ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తులు, యాప్ లపై చర్యలు తీసుకోవాలని కోరారు.