telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సుగాలి ప్రీతి కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

ఏపీలో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తులో కీలక ముందడుగు పడింది.

ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు రాష్ట్ర హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఏళ్లుగా విచారణలో ఉన్న ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను ఇకపై సీబీఐ చేపట్టనుంది.

వివరాల్లోకి వెళితే  2017 ఆగస్టులో కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో సుగాలి ప్రీతి మృతికి సంబంధించి కేసు నమోదైంది.

అప్పటి నుంచి ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, అనేక అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలనే డిమాండ్లు బలంగా వినిపించాయి.

కాగా, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గతంలో ఇచ్చిన హామీ మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా నిలుస్తామని, ఈ కేసును సీబీఐకి అప్పగించి నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపిస్తామని ఆయన గతంలో పలు సందర్భాల్లో భరోసా ఇచ్చారు.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ హామీని నెరవేరుస్తూ దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయడం గమనార్హం.

ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలను రాష్ట్ర పోలీసులు సీబీఐకి అందజేయనున్నారు.

Related posts