telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల వల్ల ఆయా నియోజకవర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాబోనని ప్రకటించిన వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

దమ్ముంటే సభకు రావాలని, ఏ అంశంపైనైనా చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు.

షరతులు పెట్టి సభకు రాకుండా ఇంట్లో కూర్చోవడం పిరికిపంద చర్య అని సోమిరెడ్డి అభివర్ణించారు. “దమ్ముంటే సభకు రావాలి కానీ, ఇలా షరతులు పెట్టుకుని పిరికిపందలా ఇంట్లో కూర్చోవడం సిగ్గుచేటు” అని ఆయన వ్యాఖ్యానించారు.

మద్యం కుంభకోణం, ఇళ్ల నిర్మాణం సహా ఏ ప్రజా సమస్యపైనైనా చర్చించడానికి అధికార పక్షం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, స్పీకర్‌పై జగన్ అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

గతంలో ఇలాంటి రాజకీయ పరిస్థితులు ఎదురైనప్పుడు ఏ పార్టీ కూడా సభను బహిష్కరించలేదని సోమిరెడ్డి గుర్తుచేశారు.

1994లో కాంగ్రెస్‌ పార్టీకి కేవలం 26 సీట్లు వచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా దక్కకపోయినా, ఆ పార్టీ నేతలు సభా కార్యకలాపాల్లో పాల్గొన్నారని తెలిపారు.

అదేవిధంగా, 1984లో లోక్‌సభలో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచిన టీడీపీకి కూడా ప్రతిపక్ష హోదా రాలేదని, అయినప్పటికీ ప్రజా సమస్యలపై పార్లమెంటులో పోరాడారని ఆయన ఉదహరించారు.

ఆ నాయకులెవరూ జగన్‌లా ఇంట్లో కూర్చోలేదని ఎద్దేవా చేశారు.

వైసీపీ తరఫున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల తీరుపై కూడా సోమిరెడ్డి స్పందించారు.

విలువలు లేని వారిని ఎన్నుకోవడం వల్ల ఆయా నియోజకవర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts