telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తెలుగుదేశం పార్టీ మహానాడు చివరి రోజు భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు

తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘మహానాడు’ కార్యక్రమం కడపలో అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. పార్టీ శ్రేణులు ఒక పండుగలా జరుపుకునే ఈ కార్యక్రమంలో ఇప్పటికే రెండు రోజుల సమావేశాలు విజయవంతంగా ముగిశాయి.

ఈరోజు మూడో రోజు, చివరి రోజు కావడంతో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు.

మహానాడులో భాగంగా తొలి రెండు రోజులు, అంటే మంగళ, బుధవారాల్లో, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు ప్రతినిధుల సమావేశాలు నిర్విరామంగా జరిగాయి.

ఈ సమావేశాలకు రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈరోజు బహిరంగ సభ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఈ సభలో పార్టీ అధినేతతో పాటు ముఖ్య నాయకులు ప్రసంగించనున్నారు.

గత ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తు లక్ష్యాలపై వారు దిశానిర్దేశం చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి లక్షలాదిగా ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు ఈ సభకు తరలివస్తారని అంచనా వేస్తున్నారు.

బహిరంగ సభకు వచ్చే వారి కోసం నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణంలో లక్ష మందికి భోజన సౌకర్యం కల్పిస్తుండగా, కడపకు దారి తీసే మార్గాల్లో మరో రెండు లక్షల మందికి భోజనాలు సిద్ధం చేశారు.

ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. గత నాలుగు, ఐదు రోజులుగా కడప జిల్లా అంతటా పసుపు జెండాలు, పచ్చని తోరణాలతో పండుగ వాతావరణం నెలకొంది.

మహానాడు ముగింపు సభతో కడపలో టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరియనుంది.

Related posts