*ఏలూరు కెమికల్ ఫ్యాక్టరీలో ఆగ్ని ప్రమాదం..
*ఆరుగురు కార్మికులు మృతి..
*ఒకరిద్దరు తప్ప అందరి పరిస్థితి విషమం..
ఏలూరు జిల్లాలోని ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో బుధవారం అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.యూనిట్-4లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా..మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. 13 మందికి తీవ్రగాయాలయ్యాయి.
క్షతగాత్రులను నూజివీడులోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు సూచించారు. యూనిట్-4లో గ్యాస్ లీకై మంటలు చేలరేగడంతో రియాక్టర్ పెద్ద శబ్దంతో పేలింది.
మృతుల్లో ఐదుగురు బీహార్‌కు చెందిన వారున్నారు. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో గాయపడిన వారందరినీ ఏడు 108 అంబులెన్స్‌లలో నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వారిని విజయవాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
సమాచారం అందుకున్న వెంటనే ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 50 మంది ఉన్నట్టు సమాచారం.
ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా ఆస్పత్రికి చేరుకుంటున్నారు. క్షతగాత్రులను చూసి బాధిత కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.