*యాదాద్రీశుని దర్శనాలు పున:ప్రారంభం.. భారీగా తరలివస్తోన్న భక్తులు
*మహాసంప్రోక్షణ పూర్తి కావడంతో దర్శనమిస్తోన్న స్వయంభు నృసింహుడు
యాదాద్రి ప్రధానాలయంలో స్వయంభు లక్ష్మీనారసింహుడి భక్తుల దర్శనాలు మొదలయ్యాయి. ఆరేళ్ళ తర్వాత గర్భగుడి నుంచి భక్తులకు స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిస్తున్నారు. నమో: నారసింహ నినాదాలతో యాదాద్రి ప్రధానాలయం భక్త జనసందోహాంతో మారుమ్రోగుతుంది. 7 రోజుల పాటు పంచకుండాత్మక మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమం పూర్తి కావడంతో స్వయంభు యాదాద్రీశుని దర్శించుకునే భాగ్యాన్ని భక్తులకు కల్పించారు.
అబ్బురపరిచే అద్భుత ఘట్టాలు.. చూపు తిప్పుకోనివ్వని శిల్పకళలు… మదిని దోచే కట్టడాలతో రూపుదిద్దుకున్న మహాదివ్య కోవెలలో.. దేదీప్యమానంగా వెలిగిపోతోన్న గర్భగుడిలో కొలువుదీరిన స్వామివారిని దర్శించి తరించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. కాలినడకన కొండపైకి భక్తులు చేరుకుంటున్నారు. పెద్దఎత్తున రానున్న భక్తులను దృష్టిలో పెట్టుకున్న అధికారులు.. కొండపైకి ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు.

