telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రసవత్తరంగా సాగర్‌ ఎన్నిక…14న కేసీఆర్‌ బహిరంగ సభ

నాగార్జున సాగర్ ఎన్నికకు సమయం దగ్గర పడుతుండడంతో పార్టీల అగ్రనేతలు హోరా హోరీ ప్రచారానికి తెర లేపనున్నారు. మూడు పార్టీలకు ఎన్నిక ప్రతిష్టాత్మకం కావడంతో అగ్ర నేతలు రంగంలోకి దిగనున్నారు. ముఖ్యమంత్రి వద్ద నుంచి బిజెపి నేత సంజయ్, కేంద్ర మంత్రులు హోరీ హోరీ ప్రచారానికి సిద్ధపడుతున్నారు. సాగర్ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ సీటును నిలుపుకోవాలని టిఆర్ఎస్… ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఇవే చివరి ఎన్నికలు అన్న విధంగా ప్రచారం చేస్తోంది. ఈ ఎన్నికల్లో గెలిస్తేనే పార్టీకి భవిఫ్యత్‌ అంటూ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి జానారెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. బిజెపికి కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో ఈ ఆరు రోజులు ప్రధాన పార్టీల అభ్యర్ధులు హోరా హోరీగా ప్రచారం చేయనున్నారు. అగ్రనేతలు ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఈ నెల 15న ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో 14న కేసీఆర్‌ భారీ బహిరంగ సభను ఏర్పాటుచేశారు. హాలియా వద్ద ఏర్పాటు చేస్తున్నారు ఆ పార్టీ శ్రేణులు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలను తరలించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. ఉప పోరులో జానారెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగారు. నల్లగొండ, భువనగిరి పార్లమెంట్‌ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతోపాటు సిఎల్ పి నేత భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డిలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. మరో భారీ బహిరంగ సభ కోసం కసరత్తులు చేస్తున్నారు. బిజెపి కూడా ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్ధమవుతోంది. అగ్రనేతలు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 3 రోజుల పాటు రోడ్ షోలు నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సభ కోసం ఏర్పాట్లుచేస్తున్నారు.

Related posts