హైదరాబాద్ లోని అమీర్‌పేట మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ప్రమాదంలో మౌనిక అనే వివాహిత ఆదివారం దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పై మృతురాలు మౌనిక భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం ఉందని తేలితే సెక్షన్ 304(A) కింద విచారణ జరిపే అవకాశాలున్నాయి. ఈ కేసులో బాధ్యులైన వారందరినీ విచారిస్తామని పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న వెల్లడించారు.
కేపీహెచ్‌బీకి చెందిన మౌనిక ఆదివారం సాయంత్రం వర్షం పడుతుండటంతో అమీర్‌పేట మెట్రో స్టేషన్ వద్ద పిల్లర్ కింద నిరీక్షిస్తున్నారు. ఆ సమయంలో పిల్లర్‌పైన ఉణ్న మెట్రో కాంక్రీటు అంచులు పెచ్చులూడి మౌనిక తలపై పడ్డాయి. తలకు బలమైన గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలారు. రక్తపు మడుగులో ఉన్న మౌనికను స్ధానికులు, మెట్రో సిబ్బంది సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మార్గమధ్యలోనే మృతి చెందారు.