telugu navyamedia
Uncategorized ట్రెండింగ్ వార్తలు సామాజిక

అక్షయ తృతీయ అంటే ఏంటి.. దాని విశిష్టత తెలుసుకుందామా !

అక్షయ తృతీయనాడు చేసే దాన ధర్మాలు అత్యధిక ఫలానిస్తాయని నారద పురాణం చెబుతోంది. ఈ శుభ తిథిన ఏ పనిచేసినా అది విజయవంతం అవుతుంది. అలాగే ఈ రోజు దుర్ముహూర్తాలూ, వర్జ్యాలూ ఉండవు. వైశాఖ మాసం శుక్లపక్ష విదియను అక్షయ తృతీయగా పాటిస్తారు. అక్షయ తృతీయ అంటే అపరిమితమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించే తిథి అని అర్థం. అందుకే ఈ రోజు ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మిని పూజించడం వల్ల సిరిసంపదలు చేకూరుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. సూర్య చంద్రులు అత్యంత ప్రకాశంగా ఉండే ఈ రోజున ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుందని పండితులు అంటున్నారు. వైశాఖ శుద్ధ తదియ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. కాబట్టి ఎంతో విశిష్టమైంది. ఈ రోజున బంగారం, వెండి కొనుగోలు చేయడం ముఖ్యం కాదు చేసే దానాలు అక్షయాన్ని ఇస్తాయి. అందుకే అక్షయ తృతీయ తెచ్చుకోవడానికే కాదు ఇవ్వడానికి కూడా అని తెలుసుకోవాలి.

 

ఈ రోజు దానం ఇస్తే గ్రహ దోషాలు, పూర్వ కర్మ ఫలితాల తొలగిపోతాయి. శ్రీమహావిష్ణువును చందనంతో పూజిస్తే విష్ణులోకం ప్రాప్తిస్తుంది. అక్షయ తృతీయ రోజున జపం,హోమం, పితృ తర్పణం, దానం అక్షయ ఫలితం లభిస్తుంది. నిత్యం భగవంతుని ఆరాధనలో ఉండే వారికీ దానం చేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి.

 

దానాలను వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి. అంటే వేసవి తాపాన్ని తగ్గించే విసనకర్ర, గొడుగు, పాదరక్షలతో పాటు దశ దానాలు కూడాశక్తి కొలది చేయవచ్చు. అలాగే ఈ రోజు ఏ పూజ చేసినా అధిక ఫలాన్ని ఇస్తుంది. పితృ తర్పణం చేస్తే పితృలకు అక్షయ పుణ్య ఫలాలు లభిస్తాయి. పితృ తర్పణం విడిచే కొడుకులకు పితృ దేవతల అనుగ్రహం అనుగ్రహం లభిస్తుంది.

 

కడవ దానం చేస్తే పితృలకు అక్షయ లోకాలను ఇవ్వటమే కాకుండా దానం చేసిన వారికి కూడా శాంతిని కలిగిస్తుంది. సముద్ర స్నాన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ రోజు ఉపవాసం చేసినా అక్షయ ఫలితం ఇస్తాయి. ఈ రోజున చేసిన హోమాలు, దానాలు, పితృదేవతలకూ, దేవతలకూ చేసే పూజలు, క్షయం కాకుండా స్థిరంగా ఉంటాయి కాబట్టి దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చిందని ధర్మరాజుకు శ్రీ కృష్ణుడు తెలియజేశాడు.

 

కేవలం దాన ధర్మాలకు, ఆధ్యాతిక చింతనకు,సేవా దృక్పథానికి ప్రత్యేకత కలిగినదే అక్షయ తృతీయ. రోగులకు సేవ, పేదలకు అన్నదానం, గోవులు, పశు పక్ష్యాదులకు దాణా, తాగడానికి నీటిని ఏర్పాటు చేయాలి. బాటసారుల దాహార్తిని తీర్చడానికి చలి వేంద్రాలు ఏర్పాటుచేయడం ఎంతో పుణ్యఫలం. దైవ పూజ – వ్రతం, మంత్ర సాధన చేస్తూ ఈ కరోనా కాలంలో ఇంట్లో పనులు చేసుకుంటూనే భగవద్గీత పారాయణం, ఆధ్యాత్మిక సందేశాలు వినడం ఉత్తమం. ఓ రెండు ముద్దలు పక్షులకు పెడితే పితరులకు, యముడు, శని, కాలభైరవునికి పెట్టినట్టే. ఈ పుణ్యకార్యాల వల్ల భవిష్యత్తు బంగారంగా మారుతుంది. కేవలం బంగారం కొనడం ద్వారా కాదు. బంగారం కొంటే లక్ష్మీదేవిని కొనేయడమే అనే భ్రమ నుంచి బయటపడండి.

 

ఈ రోజున ఉపవాస దీక్ష చేపట్టి ఏ పుణ్య కర్మ ఆచరించినా తత్సంబంధ ఫలం అక్షయంగానే లభిస్తుంది. ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు. అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు. ఈ రోజు అక్షతోదకంతో స్నానం చేసి, అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి, అర్చించాలి. తరువాత వాటిలో కొన్ని తీసి గోవునకు ఆహారంగా అరటి పండ్లు ,బెల్లం కలిపి దానమిచ్చి.. మిగిలిన వాటిని ఏదైని రూపంలో వండి దైవ ప్రసాద భావనతో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణంలో ఈశ్వర వాక్కు.

 

వైశాఖ శుక్ల తదియనాడు పైన చెప్పిన విధంగా నియమంతో అక్షయ తృతీయ వ్రతాన్ని ఆచరించి.. ఏడాది పొడువునా 12 మాసాలలో శుక్లపక్ష తృతీయ నాడు ఉపవాసం ఉండి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయయాగం చేసిన ఫలితం దక్కి అంత్యంలో ముక్తిని పొందుతారు. అక్షింతలు అంటే ఏ మాత్రం విరగని, పగుళ్ళు లేని, గట్టిగా ఉన్న బియ్యమం.. అవి వరి లేదా గోధుమ,యవల నుంచి కావచ్చు. ఇటువంటి వాటితో సిద్ధం చేసిన ఆహారాన్ని అక్షతాన్నం

శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం అక్షయ తృతీయ

కుబేరుడు చిన్నతనం నుండి శివ భక్తి తత్పరుడు. కైలాస ప్రాప్తి పొందిన గుణనిధే ఈ జన్మలో వైశ్రవణుడిగా (కుబేరునిగా) పుట్టాడని తన తపోశక్తి ద్వారా తెలుసుకున్న విశ్రవుడు, తన కుమారుడు చిన్నతనంలోనే తపస్సు చేసుకోవడానికి అంగీకరించాడు. దానితో కుబేరుడు కఠోరమైన తపస్సు చేయటం మొదలు పెట్టాడు. కొన్ని సంవత్సరాలు కేవలం ద్రవ పదార్ధాలను సేవించి, తరువాత కొన్ని సంవత్సరాలు కేవలం గాలి మాత్రమే భుజించి, అటు పిమ్మట గాలిని కూడా పీల్చకుండా వెయ్యి సంవత్సరాల పాటు చేసిన తపస్సుకు మెచ్చిన పరమ శివుడు ప్రత్యక్షమయ్యి, తనని లోకపాలకునిగా, ధనాధ్యక్షునిగా ఉండే వరమిచ్చి అంతర్ధామనవుతాడు. ఎక్కడ ఉండాలో తెలియని కుబేరుడు బ్రహ్మ కోసం తపస్సు చేయగా, ఆయన ప్రత్యక్షమయ్యి శంఖనిధి, పద్మనిధి, పుష్పక విమానం ప్రసాదించి, త్రికూట పర్వతం మీద, సముద్ర మధ్యభాగంలో ఉన్న లంకా పట్టణంలో పూర్వం రాక్షసులు ఉండేవారనీ, శ్రీహరి వలన భయంతో వారంతా పాతాళానికి పారిపోయారు కనుక అక్కడకి వెళ్ళి ఉండమనీ చెప్పి మాయమవుతాడు.

 

శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం, లంకానగరాన్ని దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ ఇంద్రుని కోసం సుమనోహరంగా నిర్మిస్తాడు. అయితే, రాక్షసులంటే భయపడే ఇంద్రుడు ఎప్పుడూ లంకలో ఉండటానికి ఇష్టపడలేదు. దానితో ఆ నగరాన్ని దేవాసుర భయంకరుడయిన సుకేశుని కుమారులకి (మాలి, సుమాలి, మాల్యవంతుడు) ఇస్తాడు. వీరిలో మాల్యవంతుడు ధర్మ వర్తనుడు. నర్మద అనే అప్సరసకి సుందరి, కేతుమతి, వసుతి అని ముగ్గురు కుమార్తెలు ఉండేవారు. లంకా నగర పాలకులయిన ముగ్గురూ ఈ ముగ్గురినీ అనగా మాల్యవంతుడు – సుందరినీ (వీరి కుమారులు – వజ్రముష్టి, విరూపాక్ష, దుర్ముఖ, సుప్తఖ్న, యజ్ఞకోశ, మత్త, ఉన్మత్త, కుమార్తె – నల), సుమాలి – కేతుమతిని (వీరి కుమారులు – ప్రహస్త, అకంబన, వికట, కలకముఖ, దుమ్రక్ష, దండ, సుపార్శ్వ, సంహ్రద, ప్రక్వత, భాసకర్ణ, కుమార్తెలు – వేక, పుష్పోల్కత, కైకసి, కంభినది), మాలి – వసుతినీ (వీరి కుమారులు – అనల, అనిల, అహ, సంపతి) వివాహం చేసుకుని లంకా నగరాన్ని పరిపాలించసాగారు. వీరి రాక్షస కృత్యాలు మితి మీరటంతో శ్రీ హరి రోజూ తన సుదర్శన చక్రాన్ని లంకా నగరం మీదకి వదిలేవాడు. దానితో మాలితో పాటు కొంతమంది చనిపోగా, మిగిలిన రాక్షసులంతా పాతాళం వెళ్లి దాక్కుంటారు. అటువంటి రాక్షస నగరమయిన లంకకు ఇప్పుడు కుబేరుడు అధిపతి కనుక రాక్షసాధిపతి అయ్యాడు. ఆ విధంగా కుబేరుడు లోకపాలకుడు, ధనాధ్యక్షుడు, రాక్షసాధిపతే కాక పుష్పక విమానాన్ని కూడా పొందాడు. దానితో కుబేరుడు తన తల్లిదండ్రులతో లంకను చేరి పరిపాలించసాగాడు. కుబేరుని ఐశ్వర్యాన్ని, వైభవాన్ని చూసిన సుమాలి (పాతాళ రాజు) అసూయ చెందాడు. సుమాలి కుమార్తె కైకసి, విశ్రవ బ్రహ్మ రెండవ భార్య అనగా కుబేరుని సవతి తల్లి. కైకసికి కూడా కుబేరుని వంటి ఐశ్వర్యవంతుడయిన కుమారుడు కావలెనన్న కోరికతో విశ్రవుని ఆశ్రమానికి వెళ్ళింది. విశ్రవుడు కైకసితో తప్పనిసరి పరిస్థితుల్లో, వేళ కాని వేళ కలిసినందున రావణుడు, కుంభకర్ణుడు (ఏనుగు యొక్క “కుంభ”స్థల ప్రమాణము కల కర్ణములు అనగా చెవులు కలవాడు అని అర్థం) అను రాక్షసులు జన్మిస్తారు. ఈ విషయం తెలుసుకున్న కైకసి తనకొక సత్పుత్రుడు కావలెనని అడగటంతో, విశ్రవుని అనుగ్రహం వలన విష్ణు భక్తి కల విభీషణుడు (దుష్టులకు విశేషమయిన భీతిని కలిగించువాడు అని అర్థం) పుడతాడు. అలా కుబేరుడు రావణాసురుడి సోదరుడనమాట! రావణాసురుడు రాక్షసుడు కావడంతో తన తాతగారయిన సుమాలి వద్ద పాతాళంలో ఉండేవాడు. కుబేరుడు మాత్రం భోగ భాగ్యాలతో లంకలో రాజ్యపాలన చేయటం చూసి తట్టుకోలేక, లంక మీదకి దండెత్తాడు రావణాసురుడు. కుబేరునికి శారీరక బలం తక్కువ, యుద్ధం చేసి జనాలను చంపే క్రూరత్వం లేదు, పైగా రావణాసురుడు హఠాత్తుగా రావటంతో రావణాసురుడు లంకను పుష్పక విమానంతో సహా స్వాధీనం చేసుకుని కుబేరుని తరిమేశాడు. దానితో భయపడిపోయిన కుబేరుడు కాశీ చేరుకుని పరమేశ్వరుని కోసం ఘోర తపస్సు మొదలుపెట్టాడు. గాలిని సైతం బంధించి, ఒంటి కాలి మీద నిలిచి, శివుని మనసులో నిలుపుకుని తపస్సు చేయసాగాడు. తన శరీరం నుండి వచ్చిన తపోగ్ని జ్వాలలు ముల్లోకాలూ వ్యాపించాయి. ఈయనకి తపోభంగం కలిగించటానికి చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. కాలం గడిచిన కొద్దీ కుబేరుని శరీరం ఎముకల గూడులా మారిపోయింది. అయినా తపస్సు చేస్తూనే ఉన్న కుబేరుని మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యి, “లంకా నగరాన్ని మించిన దివ్యభవనాలతో, అపురూపమయిన చైత్ర రథం అనే ఉద్యానవనముతో, నవ నిధులతో, మణి మాణిక్యాలతో, సర్వ సంపదలతో అలకాపురం అనే పట్టణాన్ని నిర్మించి నీకు ఇస్తున్నాను. ఇక నుండీ నీవు అక్కడే ఉంటూ, యక్షులకి, గంధర్వులకి, మయులకి, గుహ్యకులకి రాజువై ఉండమని అనుగ్రహిస్తాడు. ధనదుడవు, ధన దాతవు అయిన నిన్ను మించినవాడు ఈ సృష్టిలోనే ఉండరు. ఉత్తర దిక్కును పరిపాలిస్తూ, నా ప్రియ మిత్రుడవై, నాకు ఆప్తుడవై సంచరిస్తూ ఉండు” అని ఎన్నో వరాలిచ్చి కుబేరునికి మంచి రూపం ప్రసాదించి అదృశ్యమవుతాడు. అందుకనే అధిక ధనము కల వారిని “అపర కుబేరులు” అంటారు.

 

వైశాఖ శుధ్ద తదియ నే అక్షయ తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజునే సింహాచల వరాహ నరసింహ స్వామి వారి చందనోత్సవం కూడా జరుగుతుంది. స్వామి వారు భక్తులకు నిజరూప దర్శనం ఇస్తారు. అక్షయ తృతీయ ప్రాముఖ్యతలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని చూద్దాం

 

1. పరశురాముని జన్మదినం.

 

2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం.

 

3. త్రేతాయుగం మొదలైన దినం.

 

4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం.

 

5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో , వ్రాయడం మొదలుపెట్టిన దినం.

 

6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం.

 

7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం.

 

8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం.

 

9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం.

 

10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.

 

అక్షయ తృతీయ నాడు , మనం చేపట్టిన ఏ కార్య ఫలమైనా , (అది పుణ్యం కావచ్చు , లేదా పాపం కావచ్చు) అక్షయంగా , నిరంతరం , జన్మలతో సంబంధం లేకుండా , మన వెంట వస్తూనే ఉంటుంది. పుణ్య కర్మలన్నీ విహితమైనవే. అందునా , ఆ రోజు ఓ కొత్త కుండలో గానీ , కూజాలో గానీ , మంచి నీరు పోసి , దాహార్తులకు శ్రధ్ధతో సమర్పిస్తే , ఎన్ని జన్మలలోనూ , మన జీవుడికి దాహంతో గొంతు ఎండి పోయే పరిస్థితి రాదు. అతిధులకు , అభ్యాగతులకు , పెరుగన్నంతో కూడిన భోజనం సమర్పిస్తే , ఏ రోజూ ఆకలితో మనం అలమటించవలసిన రోజు రాదు. వస్త్రదానం వల్ల తదనుగుణ ఫలితం లభిస్తుంది. అర్హులకు స్వయంపాకం , దక్షిణ , తాంబూలాదులు సమర్పించుకుంటే , మన ఉత్తర జన్మలలో , వాటికి లోటు రాదు. గొడుగులు , చెప్పులు , విసన కర్రల లాటివి దానం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆ రోజు నిషిధ్ధ కర్మల జోలికి వెళ్ళక పోవడం ఎంతో శ్రేయస్కరం. అక్షయ తృతీయ అదృష్టం మరియు విజయాన్ని తెస్తుందని నమ్ముతారు. 

Related posts