‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి అవికా గోర్. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో అవికా గోర్ టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ సినిమా తరువాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇటీవల ‘రాజుగారి గది 3’లో హీరోయిన్గా నటించింది. చాలా గ్యాప్ తరువాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె బరువు తగ్గి బాగా స్లిమ్‌గా తయారైంది. అయితే దీనికి ప్రత్యేకమైన కారణమే ఉందట. తాజాగా అవికా తను సన్నబడడం గురించి మాట్లాడుతూ “గతేడాది ఒక రోజు రాత్రి అద్దంలో నన్ను నేను చూసుకుని ఏడ్చాను. ఆ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను. నా శరీరం నాకు అస్సలు నచ్చలేదు. నేను నా శరీరానికి తగినంత గౌరవం ఇవ్వలేదు. దాని ఫలితమే నా ఊబకాయం. శరీరాకృతి విషయంలో ఎన్నోసార్లు బాధపడ్డాను. ఇలాంటి ఎన్నో ఆలోచనలు నాకు మనశ్శాంతి లేకుండా చేశాయి. అయితే ఏదీ ఒక్క రాత్రిలోనే మారిపోదని అర్థం చేసుకున్నాను. ఆరోగ్యకరమైన ఆహారం, వర్కవుట్లపై దృష్టి సారించాను. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ నేను ఆగలేదు. నా చుట్టూ ఉన్న వాళ్లు కూడా నాకు సహాయం చేశారు. ఈ రోజు మళ్లీ అద్దంలో చూసుకున్నాను. ఎంతో అందంగా ఉన్నావని నాకు నేను చెప్పుకున్నా” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
previous post