telugu navyamedia
సినిమా వార్తలు

64 సంవత్సరాల “ శ్రీవెంకటేశ్వరమహాత్మ్యం” (బాలాజీ).

నందమూరి తారకరామారావు గారు నటించిన పౌరాణిక చిత్రం పద్మశ్రీ పిక్చర్స్ “శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం” (బాలాజీ) చిత్రం 09-01-1960 విడుదలయ్యింది. నిర్మాత వి.వెంకటేశ్వరులు గారు పద్మశ్రీ పిక్చర్స్ బ్యానర్ పై సుప్రసిద్ద దర్శకులు పి.పుల్లయ్య గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు : ఆత్రేయ, పాటలు: ఆత్రేయ,ఆరుద్ర, మల్లాది రామకృష్ణశాస్ర్తీ, పద్యాలు: నారపరెడ్డి, సంగీతం: పెండ్యాల, ఫోటోగ్రఫీ: పి.ఎల్.రాయ్, నృత్యం: వెంపటి సత్యం, కళ: ఎస్.వి.ఎస్.రామారావు, ఎడిటింగ్: కె.ఏ.శ్రీరాములు, అందించారు. ఈ చిత్రంలో శ్రీనివాసుడుగా ఎన్.టి. రామారావు, లక్ష్మీదేవి గా యస్.వరలక్ష్మి, పద్మావతి గా సావిత్రి, నటించగా మిగిలిన పాత్రలతో గుమ్మడి, రాజనాల, కాంతారావు, శాంతకుమారి,.నాగయ్య, రమణారెడ్డి, సురభి బాలసరస్వతి, ఎస్.జానకి, ఋష్యేంద్రమణి, వల్లూరి బాలకృష్ణ, ఆత్రేయ, ఘంటసాల, పేకేటి శివరాం తదితరులు నటించారు.

ప్రముఖ సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీత సారధ్యంలో జాలువారిన పాటలు ప్రేక్షకులను సమ్మోహన పరిచాయి.
“గోపాలా,నందగోపాలా,ఎన్నాళ్ళని నాకన్నులు కాయగ ఎదురు చూతురా గోపాల”
“వరాల బేరమయా,వనరౌ బేరమయా పరాకు చేయకు”
“పదవే పోదాము గౌరీ పరమాత్ముని చూడ ”
” శేషశైలావాసా శ్రీవేంకటేశా”
వంటి పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు “శేషశైలవాసా శ్రీ శ్రీనివాసా శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా” అంటూ ఆయన స్వయంగా ఈ చిత్రం లో నటించి గానం చేసిన మధురాతి మధురమైన ఈ పాట శ్రోతలను విశేషం గా ఆకట్టుకున్నది. వాహినీ స్టూడియోలో తిరుమల తిరుపతి  శ్రీ వెంకటేశ్వరస్వామి గర్భాలయం సెట్టు వేసి, “శేష శైల వాసా”.. పాటను ఘంటసాల పై చిత్రీకరించారు.

ఈ చిత్రం కోసం శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని నిజంగానే వేద మంత్రాల మధ్య ప్రతిష్టించారు. సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు .. నిత్య ధూప దీప నైవేద్యాలు ఇతర కైంకర్యాలను దేవుని గుడిలో జరిగే విధంగానే జరిపించేవారు.. తొలివిడత 20 ప్రింట్లతో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్లు తో ఘన విజయం సాధించి విడుదలైన అన్ని కేంద్రాలలో 50 రోజులు, 16 కేంద్రాలలో 100 రోజులు (శతదినోత్సవాలు) జరుపుకుని రికార్డు సృష్టించింది.
రెండు కేంద్రాలలో 175 రోజులు (రజతోత్సవం) జరుపుకున్నది…
1.హైదరాబాద్ — సాగర్ (105 రోజులు+షిఫ్ట్ మీద 175 రోజులు)
2.విజయవాడ — దుర్గా కళామందిరం (153 రోజులు + షిఫ్ట్ మీద175 రోజులు)
కర్ణాటక లోని బెంగుళూరు నగరం లో మూడు కేంద్రాలలో 100 రోజులు ఆడింది.
1. బెంగుళూరు — స్వస్తిక్,
2. బెంగుళూరు — గీతా,
3. బెంగళూరు — మినర్వా,
ఈ సినిమా శతదినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకులు కోటి మందికి పైగా ఉన్నట్టు నిర్మాతలు ఆ నాడు పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. ఈ చిత్రం ప్రదర్శింపబడే రాష్ట్రంలోని థియేటర్ల వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు పెట్టి పూజలు జరపడం ఈ చిత్రంతోనే ప్రారంభమైనది.. ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు పెట్టి అక్కడ హుండీలు పెట్టగా, ప్రేక్షకులు ఆ హుండీల్లో వేసిన డబ్బులుతో అవి నిడిపోయేవి, ఆ డబ్బులను నిర్మాతలు తిరుపతి దేవస్థానానికి పంపించేవారు. ఆ కాలంలో ఈ సంగతి గొప్పగా చేప్పుకునేవారు… ఈ చిత్రం విడుదలైన తర్వాత కొంత మంది భక్తులు “తిరుమల-తిరుపతి” వెళ్ళి శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శనం చేసుకున్న అనంతరం తెలుగువారు అటు నుండి అటే మద్రాసు వెళ్ళి ఎన్.టి. రామారావు గారిని చూసి వెళ్లి కానీ తమ తీర్థయాత్ర ను పూర్తిచేసుకునే వారు కాదు ఆనాటి తెలుగు ప్రజలు…..

Related posts