నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మిలిటెంట్లుగా భావించి పౌరులపై భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 11 మంది మృతి చెందారు. మరో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన డిసెంబర్ 4 రాత్రి చోటుచేసుకుందని సమాచారం.
శనివారం సాయంత్రం బొగ్గు గని నుండి కొంతమంది రోజువారీ కూలీ కార్మికులు విధులు ముగించుకుని పికప్ వ్యాన్‌లో ఇంటికి తిరిగి వెళ్తుండగా మోన్ జిల్లాలోని ఓటింగ్ వద్ద ఈ కాల్పులు జరిగాయి. అయితే, మిలిటెంట్ల కదలికలపై భద్రతా బలగాలకు సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో ఆపరేషన్ నిర్వహిస్తున్న ఆర్మీ సిబ్బంది వాహనంపై కాల్పులు జరిపినట్లు ఆరోపణలు సమాచారం.
ఈ మేరకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన బలగాలు.. కాల్పులు జరిపాయి. అయితే, కాల్పుల్లో పౌరులే ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఈ పరిణామంతో జిల్లాలోని ఓటింగ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. స్థానికులు భద్రతా బలగాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బలగాల వాహనాలను తగులబెట్టారు.
ఈ ఘటనను ఖండిస్తూ, ఉన్నత స్థాయి ప్రత్యేక దర్యాప్తు బృందం దీనిపై విచారణ జరుపుతుందని నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫియు రియో తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల శాంతియుతంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సంఘటన అత్యంత దురదృష్టకరమని, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. దీనిపై సిట్ విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు.