స్నేహితుల దినోత్సవం రోజే సందర్భంగా సరదాగా గడిపేందుకు శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతానికి వెళ్లిన మిత్రులలో ముగ్గురు నీటిలో గల్లంతయ్యారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. నిజామాబాద్ నగర శివారులోని అర్సపల్లి గ్రామానికి చెందిన సాయికృష్ణ, రోహిత్, రాజేందర్, రాహుల్, ఉదయ్, శివ స్నేహితులు. ఆదివారం ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఆనందంగా, ఆహ్లాదంగా ఉండే గోదావరి తీరానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నందిపేట మండలంలోని జీజీ నడ్కుడ గ్రామ సమీపంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఉండే ప్రాంతానికి చేరుకున్నారు.
స్నానం చేసేందుకు నీటిలోకి దిగారు. అయితే, ఆ ప్రాంతంలో గతంలో జేసీబీతో మట్టి తీసిన పెద్ద పెద్ద గుంతలున్నాయి. ఆ సంగతి తెలియని శివ మరింత ముందుకు వెళ్లడంతో కాలు జారి గుంతలోకి జారిపోయాడు. అతడిని కాపాడేందుకు వెళ్లిన రాహుల్(20), శివ (19), ఉదయ్(19) కూడా నీటమునిగిపోయారు. గమనించిన రోహిత్, రాజేందర్ గట్టిగా కేకలు వేయగా, సమీపంలో ఉన్న ఓ పశువుల కాపారి పరిగెత్తుకొచ్చాడు. వాటర్‌పైపును నీటిలోకి వేయగా, సాయికృష్ణ చాకచక్యంగా దానిని పట్టుకుని బయటకు వచ్చాడు. మిగతా ముగ్గురు రాహుల్, ఉదయ్, శివ నీటిలోనే గల్లంతయ్యారు. సమాచారమం అందుకున్న పోలీసులు, గ్రామస్తులు బ్యాక్ వాటర్ ప్రాంతానికి చేరుకుని గాలింపు చేపట్టారు. అర్థరాత్రి వరకూ గాలించినా ఆ ముగ్గురి ఆచూకీ లభిం చలేదని తహసీల్దార్ అనిల్ కుమార్, ఎస్సై శోభన్‌బాబు తెలిపారు.