“క్షణం” సినిమాతో ఊహించని సక్సెస్ ను అందుకున్నాడు హీరో అడివిశేష్. లిమిటెడ్ బడ్జెట్‌లో రూపొందించిన ఈ సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఇప్పుడు మరోసారి పివిపి సినిమా, హీరో అడివిశేష్ కాంబినేషన్‌లో “ఎవరు” అనే థ్రిల్లర్ చిత్రం రూపొందుతోంది. వెంకట్ రామ్ జీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాతలు. ఈ చిత్రంలో అడివిశేష్ హీరోగా నటిస్తుండగా, రెజీనా కసండ్ర హీరోయిన్‌గా నటిస్తుంది. నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రానికి వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇంతకుముందు విడుదల చేసిన ప్రీ లుక్ లో అడివి శేష్ విక్రమ్ వసుదేవ్ బ్యాడ్జ్‌తో కన్పించాడు. ఇక ఇటీవలే విడుదల చేసిన టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదల కానుంది. సోమవారం ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను నాని చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో అడివిశేష్ మాట్లాడుతూ “టీజర్ రిలీజ్ టైమ్‌లో చిన్నపాటి టెన్షన్ ఉండింది. కానీ ఇప్పుడు చాలా కామ్‌గా ఉన్నాను. అందుకు కారణం మేం సాలిడ్ మూవీని చేశామని నమ్మకంగా ఉంది. ఈ సినిమాలో అందరూ రెండు ముఖాలను కలిగి ఉంటారు. ఈ మనిషి ఇలా ఉంటారని ప్రేక్షకుడు అనుకున్న పది నిమిషాలకు ఆ మనిషి మారిపోతుంటాడు” అన్నారు.


