telugu navyamedia
రాజకీయ

అమర్‌నాథ్‌లో వ‌ర‌ద బీభత్సం : 16 మంది మృతి..40 మంది గ‌ల్లంతు

*అమర్‌నాథ్‌లో వ‌ర‌ద బీభత్సం
*కొట్టుకుపోయిన యాత్రికులు టెంట్లు
*16 మంది మృతి..40 మంది గ‌ల్లంతు
*స‌హ‌య చ‌ర్య‌లు చేప‌ట్టి ఆరు రెస్య్కూ సిబ్బంది

దక్షిణ జమ్మూ కశ్మీర్‌లోని అమర్‌నాథ్‌ యాత్ర‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.అమ‌ర్‌నాథ్‌డుని దర్శించికుని అక్కడి ఆధ్యాత్మిక జ్ఞాపకాలను మూటగట్టుకొని తమ వాళ్లు సంతోషంగా ఇళ్లకు తిరిగొస్తారని ఆశలు పెట్టుకున్న వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అల‌ముకుంది.

శుక్ర‌వారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో వరద బీభత్సం సృష్టించింది.

కొండల పైనుంచి భారీఎత్తున పోటెత్తిన వరద ఉధృతికి భక్తుల కోసం ఏర్పాటు చేసిన 25 టెంట్లు, మూడు సామూహిక వంటగదులు కొట్టుకుపోయాయి.

ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా 16 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. పోటెత్తిన వరదలో 40 మంది కొట్టుకుపోయి గల్లంతయ్యారు. మరికొందరు గాయాలపాలయ్యారు. 

మంచుకొండల్లో మృత్యుఘోష

క్షతగాత్రులను ప్రత్యేక హెలికాప్టర్లలో ఎక్కించుకొని బేస్‌ క్యాంప్‌ ఆస్పత్రులకు తరలించారు. అవసరమైన చోట హెలికాప్టర్లలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని, ముందుగా లోతట్టు ప్రాంతాల వారిని తరలిస్తున్నట్లు ఐటీబీపీ అధికారులు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది యాత్రికులేనని తెలుస్తోంది

అతి భారీ వర్షం ధాటికి యాత్రా మార్గం ధ్వంసమవడంతో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీసులు (ఐటీబీపీ), జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్డీఆర్‌ఎఫ్‌) సభ్యులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం వెతుకుతున్నారు.

ఈ ఘటన పట్ల రాష్ట్రపతి కోవింద్‌, ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత భక్తులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందుతాయని భరోసా ఇచ్చారు. ఘటన వివరాలపై మోదీకి జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ఫోన్లో వివరించారు. కాగా ప్రభావిత ప్రాంతాల్లో అత్యంత వేగవంతంగా సహాయక చర్యలను చేపట్టాలని కేంద్రబలగాలు, జమ్మూ కశ్మీర్‌ యంత్రాంగానికి హోంమంత్రి అమిత్‌ షా అదేశాలు జారీ చేశారు.

ఈ ఘటనపై తాను జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హాతో మాట్లాడినట్లు, ఎన్డీఆర్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, బీఎ్‌సఎఫ్‌ బలగాలు సహాయక చర్యలకు దిగినట్లు ట్విటర్‌లో అమిత్‌ షా వెల్లడించారు. ‘‘భక్తుల ప్రాణాలు కాపాడటమే మా తొలి ప్రాధాన్యమ‌ని భక్తులందరూ క్షేమంగా ఉంటారనే ఆశిస్తున్నాను’’ అని ట్విటర్‌లో ఆయన రాశారు.

Related posts