“మన్మథుడు” సినిమాను ఇన్స్పిరేషన్గా తీసుకుని కింగ్ నాగార్జున రూపొందిస్తున్న మరో ఎంటర్టైనర్ “మన్మథుడు-2”. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై నాగార్జున అక్కినేని, పి.కిరణ్ (జెమిని కిరణ్) నిర్మిస్తున్న “మన్మథుడు-2” చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ యూరప్‌లో ప్రారంభం కానుంది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించనున్నారు. ఇటీవల ‘‘నేను, నా ‘మన్మథుడు 2’ ఫ్యామిలీ!! లవింగ్ ఇట్’’ అంటూ నాగార్జున ఓ ఫొటోను ట్వీట్ చేశారు. ఈ ఫొటోలో సీనియర్ నటి లక్ష్మీ, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, రావు రమేశ్, ‘వెన్నెల’ కిశోర్, ఝాన్సీ, చిత్రదర్శకుడు రాహుల్ రవీంద్రన్ తదితరులు ఉన్నారు. ఇక “RX100” ఫేమ్ చైతన్య భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం గురించిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో సమంత కూడా నటిస్తుందనే ఆ వార్త సారాంశం. ఈ చిత్రంలో ఓ క్యామియో రోల్లో అక్కినేని కోడలు సమంత కనిపించనుందట. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న రాహుల్ రవీంద్రన్ కు సమంత మంచి ఫ్రెండ్ కావడం, పైగా మామయ్య నాగార్జున సినిమా కావడంతో రోల్ చిన్నదైనా సమంత నటించేందుకు సిద్ధమైందని చెబుతున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటేచిత్రబృందం క్లారిటీ ఇచ్చేవరకూ వేచి చూడాల్సిందే.