telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“పేట” మా వ్యూ

Rajanikanth Petta release images

బ్యానర్ : స‌న్ పిక్చ‌ర్స్‌
న‌టీన‌టులు: ర‌జ‌నీకాంత్‌, సిమ్ర‌న్‌, త్రిష‌, విజ‌య సేతుప‌తి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, బాబీ సింహా, యోగిబాబు త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం: కార్తీక్ సుబ్బ‌రాజు
సంగీతం: అనిరుధ్ ర‌విచంద్ర‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: తిరు
ఎడిటింగ్‌: వివేక్ హ‌ర్ష‌న్
నిర్మాత‌: క‌ళానిధి మార‌న్‌, అశోక్ వ‌ల్ల‌భ‌నేని

సౌత్ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ వరుసగా వచ్చిన గత చిత్రాలతో ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయారు. 2.0 లాంటి భారీ చిత్రం తరువాత మూడు నెలల్లోనే శరవేగంగా తన అభిమాని, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో “పేట” సినిమాను పూర్తి చేశారు. ఈరోజు ఈ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రమైనా సూపర్ స్టార్ అభిమానులను మెప్పించిందో లేదో చూద్దాం.

కథ :
ఓ హాస్ట‌ల్ వార్డెన్‌ కాళీ(ర‌జ‌నీకాంత్‌)… హాస్టల్ దగ్గర జరుగుతున్న ర్యాగింగ్ పై దృష్టి పెడతాడు కాళీ. మైకేల్‌ (బాబీ సింహ‌) గ్యాంగ్ జూనియ‌ర్స్‌ను ఇబ్బంది పెట్టడం చూసిన కాళీ వాళ్ళను అడ్డుకుంటాడు. ఈ విషయం మైకేల్ తండ్రి, లోక‌ల్ డాన్‌ వరకు చేరి పెద్ద గొడ‌వగా మారుతుంది. మరోవైపు అన్వ‌ర్ అనే కుర్రాడి మేఘా ఆకాశ్‌ ను ప్రేమిస్తాడు. వారి ప్రేమను ఆమె త‌ల్లి మంగ‌ళ‌ (సిమ్రాన్‌)తో మాట్లాడి ఒప్పిస్తాడు కాళీ. అదే స‌మ‌యంలో కోపంతో ఉన్న మైకేల్ తండ్రి కొంత మందిని రౌడీలను పంపి కాళీని కొట్ట‌మ‌ని చెప్తాడు. అయితే ఆ రౌడీలు మైకేల్‌తో పాటు, కాళీని కూడా చంప‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. కానీ కాళీ తన దెబ్బతో వారిని పరుగులు పెట్టిస్తాడు. అప్పుడే అతను కాళీ కాద‌ని, “పేట వీర” అని తెలుస్తుంది. అత‌నికి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని సింఘా (న‌వాజుద్దీన్ సిద్ధికీ)తో పాత ప‌గ‌లుంటాయనే విషయం తెలుస్తుంది. అస‌లు కాళీకి ఉన్న గతం ఏంటి? ఈ ప‌గ‌కు, అన్వ‌ర్‌కి ఉన్న సంబంధం ఏంటి? సినిమాలో త్రిష పాత్ర ఏంటి ? చివ‌ర‌కు పేట ఏం చేశాడు? అనే విష‌యాలు తెలియాలంటే వెండి తెరపై సినిమాను వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
రజినీకాంత్ ఈ సినిమాలో అభిమానులు ఎలా కోరుకుంటున్నారో అలా కన్పించారు. సినిమాలో రజినీకాంత్ స్టైల్స్ , మేనరిజంలను చాలా ఎంజాయ్ చేస్తూ చేశారు. ఆయన కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమాలో యంగ్ గా కన్పించడమే కాదు… రజినీకాంత్ డ్యాన్సులతో అదరగొట్టారు కూడా. ఇక త్రిష, సిమ్రన్ ఇద్దరి లుక్ లోనూ ఏజ్ ఎక్కువైనట్టుగా కన్పించింది. విజయ్ సేతుపతి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నవాజుద్ధీన్‌ సిద్ధిఖీ నటించిన తొలి సౌత్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. సింఘా పాత్రలో ఆయన నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది. బ్యాడ్ స్టూడెంట్ లీడర్ గా బాబీ సింహ పాత్ర సినిమాలో పరిమితంగానే ఉంది. హీరో స్నేహితుడుగా నటించిన శశి కుమార్, త్రిష, మేఘా ఆకాష్ తదితరులు తమ పరిధిమేర నటించి ఆకట్టుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు :
సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమాని, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్… ప్రేక్షకులు రజినీని ఎలా చూడాలని కోరుకుంటున్నారో ఆ విధంగానే తెరపై చూపించారు. అయితే ఈ కథ మాత్రం పాతదే కావడం విశేషం. హీరో ఎక్కడో అజ్ఞాతవాసిగా పరిచయమవ్వడం, ఆ తరువాత హీరోకు ఉన్న బ్యాక్ గ్రౌండ్ బయటపడడం… రజినీకాంత్ భాషా సినిమాతో సృష్టించిన ఈ ట్రెండ్ ను ఫాలో అయ్యి తెలుగులో చాలామంది దర్శకులు ఎప్పుడో వండి వార్చేశారు. ఇలాంటి కథలు ఇప్పటితరానికి పెద్దగా ఆసక్తికరంగా ఉండకపోవచ్చు. అయినా గతంలో రజినీకాంత్ లో కన్పించని ఓ ఎనర్జీని కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాలో చూపించాడు. ప్రథమార్థం మొత్తం కామెడీ, మాస్ డైలాగ్స్, ఫైట్స్ వంటి సన్నివేశాలతో సరదాగా చూపించి, ద్వితీయార్థంలో అసలు కథలోకి వచ్చేశాడు. కానీ సినిమాలో ఎక్కువగా తమిళ నేటివిటీ కన్పించడం సినిమాకు మైనస్. అనిరుధ్ పాట‌లు ఫరవాలేదన్పించాయి. కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. తిరు కెమెరా ప‌నిత‌నం బావుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టుగా ఉన్నాయి.

రేటింగ్ : 3/5

Related posts