telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చదలవాడ శ్రీనివాసరావు మానవత్వం – పేద సినిమా కళాకారులు , కార్మికులకు ఆపన్న హస్తం

Chadalavada-srinivasa-rao

ప్రపంచాన్ని కరోనా వైరస్ పూర్తిగా దిగ్భంధం చేసేసింది. ఇది కనీవినీ ఎరుగని విషాద ఘట్టం, చరిత్రలో మిగిలిపోతున్న కారుణ్య కాలం. యావత్ మానవ జాతిని భయబ్రాంతులకు గురిచేసిన కంటికి కనిపించని వైరస్ కరోనా. ఈ కరోనా మనిషి మనుగడను మార్చేసింది. మనిషి ఆలోచనలను, అభిప్రాయాలను, నడవడికను పూర్తిగా తుడిపేసి నూతన ఒరవడికి నాంది పలికింది. కరోనా రేపిన కల్లోలం ఇంతా అంతా కాదు. యావత్ ప్రపంచాన్ని స్థంభింపజేసింది. ఇది మానవుడు ఊహించని విపత్కర పరిణామం. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా సాగే మనిషిని రెండు నెలల పాటు ఇంట్లో కూర్చోపెట్టింది. ఈ రెండు నెలలు ఎన్నో బతుకు పాఠాలను నేర్పింది. అయితే డబ్బున్న వారు హాయిగా ఇంట్లో కూర్చున్నారు. వారికి ఎలాంటి లోటు లేదు. అయితే రోజువారీ కష్టం చేసేవారి బతుకు మాత్రం ఛిద్రమై పోయింది. పూట గడవడం గగనమై పోయింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవడానికి ముందుకు వచ్చాయి. మేమున్నామనే భరోసా ఇచ్చాయి. కరోనా ప్రభావం సినిమా రంగంపై కూడా చాలా పడింది. సినిమా అసంఘటిత రంగం. ఇది కేవలం సినిమా మీదనే ఆధారపడింది. ఈ రంగంలో 12 వేల మంది కళాకారులు, కార్మికులు వున్నారు.

Chadalavada

లాక్‌డౌన్‌ నేపథ్యంలో షూటింగ్‌లకు బ్రేక్ పడటంతో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. వీరిని చిరంజీవి అధ్యక్షతన ఏర్పడిన కమిటీ నిత్యావసర సరుకులు పంపిణీ చేసి ఆదుకుంది. అయినా గుర్తింపులేని నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఆర్ధికంగా దెబ్బతిన్న నిర్మాతలు వున్నారు. వీరిని ఆదుకోవడం కోసం ప్రముఖ నిర్మాత మానవతావాది చదలవాడ శ్రీనివాసరావు ముందుకు వచ్చారు. కరోనా సమయంలో నేనున్నాననే భరోసా ఇచ్చారు. రూ.30,83,333/- (ముప్పై లక్షల ఎనభై మూడు వేల మూడువందల ముప్పై మూడు రూపాయలు)లను తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఆపన్నులకు అందించామన్నారు. శ్రీనివారరావు స్ఫూర్తిగా హీరో శివాజీ రెండు లక్షలు, మరి కొంతమంది కూడా ఆర్ధికంగా సహాయం అందించారు. నిర్మాతల మండలి అధ్యక్షులు సి.కళ్యాణ్, కార్యదర్శులు తుమ్మల ప్రసన్న కుమార్, మోహన్ వడ్లపట్ల. అయితే ప్రసన్న కుమార్, మోహన్ ఇద్దరు అర్హులు, ఆపన్నులను గుర్తించి వారికి ఆర్ధిక సహాయం అందిచడం నిజంగా అభినందనీయం.

Chadalawada

నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ కు ఫిలిం మీడియేటర్స్ కు, పేస్టింగ్ బాయ్స్ కు, రిప్రజెంటేటివ్ లకు, మేకప్, కాస్టూమ్స్, సెట్, పైటర్స్, లేడి డాన్సర్స్ సహాయకులకు, వివిధ సంఘాల్లో సభ్యులు కానివారికి ఆర్ధిక సహాయం చేశారు. కష్టకాలంలో సాటి మనిషిని ఆదుకోవడం, వారి బతుకు ఛిద్రం కాకుండా ఆపన్న హస్తం అందించడం, కరోనా సమయంలో భరోసా ఇవ్వడడం మానవత్వం మూర్తీభవించిన మనుషులను మనస్ఫూర్తిగా అభినందించాలి. ఈ సందర్భంగా నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, తుమ్మల ప్రసన్న కుమార్, మోహన్ వడ్లపట్లను నవ్యమీడియా అభినందిస్తుంది.

– విమలత

Related posts