telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సినీ కార్మికుల కోసం .. తెలంగాణ ప్రభుత్వానికి .. జనసేనాని విజ్ఞప్తి ..

pavan kalyan on ycp and tdp

తెలంగాణ ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. చిత్రపురి కాలనీలో ఇళ్లు దక్కని సినీ కార్మికుల కోసం ప్రభుత్వం మరికొంత స్థలం కేటాయిస్తే 30వేలమంది కార్మికులకు నివాసం కల్పించినట్లు అవుతుందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్థలం కేటాయింపుపై అవసరమైతే ప్రభుత్వానికి జనసేన పార్టీ తరఫున వినతి పత్రం అందిస్తామన్నారు. హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో తెలుగు సినీ వర్కర్స్‌ కో-ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ కార్యవర్గ సభ్యులతో పవన్‌ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ.. ”చిత్ర పరిశ్రమ కోట్లాది ప్రేక్షకులకు వినోదం అందిస్తోంది. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. మద్రాసు నుంచి హైదరాబాద్‌కు చిత్ర పరిశ్రమ వచ్చినప్పటికి ఇప్పటికీ చాలా పెరిగింది. దాదాపు 35వేలమంది కార్మికులు పరిశ్రమను నమ్ముకొని ఉన్నారు. ప్రభుత్వం కేటాయించిన స్థలం చాలడం లేదు. దీనికి అదనంగా మరికొంత స్థలాన్ని కేటాయించడంతో పాటు, చిత్రపురి కాలనీ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. పరుచూరి వెంకటేశ్వరరావు ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చారు. ఆయన ఆధ్వర్యంలో అందరికీ న్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నా” అని అన్నారు.

ఈ సందర్భంగా తెలుగు సినీ వర్కర్స్‌ కో-ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ అధ్యక్షుడు పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ”4వేలమందికి సరిపడే స్థలాన్ని 40వేల మందికి సర్దడం చాలా కష్టం. మరో 9 ఎకరాల స్థలం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరాం. ఇందుకు ప్రభుత్వం కూడా సుముఖత వ్యక్తం చేసింది. పవన్‌ కల్యాణ్‌ కూడా సినీ కార్మికుల తరపున ప్రభుత్వానికి విన్నవిస్తే పేదలకు త్వరగా లబ్ది చేకూరుతుంది” అని అన్నారు. మరి పవన్ కల్యాణ్ విజ్ఞప్తిపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related posts