telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు సామాజిక

ప్రకృతి ఒడిలో .. కదిలి పాపహరేశ్వర క్షేత్రం.. శ్రావణమాస ప్రత్యేక పూజలు..

kadili siva kshetram special ustav in sravana masam

ప్రకృతి ఒడిలో..మాతాన్నపూర్ణేశ్వరీ సమేతుడై వెలిసిన స్వయంభూ లింగాకారుడాయన. తండ్రి ఆజ్ఞపై తల్లి తలనరికిన పరశురాముడి మాతృహత్యా పాతకాన్ని తొలగించిన పరమ పావన క్షేత్రమిది. అదే కదిలి పాపహరేశ్వర క్షేత్రం. తన భక్తుడి పరమ భక్తికి తన్మయత్వంతో ఆ స్వామి కదలడంతో ఈ ఆలయానికి.. ఈ ప్రాంతానికి కదిలె అని పేరొచ్చింది. తన భక్తుడిని పాపవిముక్తిడిని చేయడంతో స్వామి పాపహరేశ్వరుడయ్యాడు. దట్టమైన అడవులు.. ఎతైన కొండలు నుడుమ కొలువైన ఈ శివాలయంలోఎన్నో విశేషాలు, వింతలు, ఏకశిలతో చేసిన శిల్పకళాకృతులు ఉన్నాయి.అంతేగాకుండా ఎతైనా కొండలపై బండరాళ్లలో ఏడాది పొడవునా ఎండిపోకుండా ఒకే లాంటి జలధారతో ఉండే రుషిగుండం ప్రధానమైంది. ఇందులోనే పరశురాముడు నిత్యాస్నామాచరించి పాపన్నకు పూజించాడు. పక్కపక్కనే ఉన్నా ఒకదాంట్లో వేడిగా, మరోదాంట్లో చల్లగా ఉండే సూర్య,చంద్రగుండాలు.. పాలవలే తెల్లని నీళ్లతో గల గల పారే పాల గుండం, ఎంతటి శతృత్వం ఉన్నా… తనలో ఒక్కసారి మునిగితే అత్తాకోడళ్లను కలిపేసే అత్తాకోడళ్ల గుండం,.. తీర్థాన్ని తలపించే నీళ్లుగల తీర్థగుండం, వీటన్నింటితో పాటు ఆవు మూతి నుంచి సలల ధార వచ్చే ఆవుమూతి గుండం, ఇక్కడి సప్తగుండాలు.

కదిలె పాపహరేశ్వరుగు మాతాన్నపూర్ణేశ్వరీ సమేతుడై కొలువయ్యాడు. అయ్యవారి ఆలయం వద్ద వెనుకభాగంలో అమ్మవారు కోలువయ్యాడు. మాత అన్నపూర్ణేశ్వరి దక్షిణాభిముఖంగా ఉండటం ఇక్కడి విశేషం. యమస్థానమైన దక్షిణం ఉన్న అమ్మవారిని పూజిస్తే అకాల,అపమృత్యుదోషాలు, అన్ని సమస్యలూ తొలగిపోతాయని స్థల పురాణం. ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో త్రిమూర్తులు దర్శనమిస్తారు. పాపన్న ఆలయానికి కుడి వైపు బ్రహ్మ, ఎడమవైపు నటరాజ స్వామి విగ్రహాలు ఉంటాయి. ఇక గర్భగుడికి కుడివైపు వరాహస్వామి, ఎడమవైపు విష్ణుమూర్తి, ఉండడం ఆలయ శిఖరంపై పంచముఖ శివుడు విగ్రహం ఇక్కడి ప్రత్యేకత.

మాతృ హత్యా పాతకం నుంచి తను విముక్తిని చేయాలంటూ పరమశివుడి కోసం ఘోర తపస్సు చేశాడు పరశురాముడు. ఈ క్రమంలో దేశమంతటా పర్యటిస్తూ 31 శివలింగాలను ప్రతిష్టించి పూజలు చేశాడు. దక్షిణ దిశగా బయలు దేరిన పరశురామడు గోదావరి తీరప్రాంతమైన ప్రస్తుత నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలంకు చేరాడు.ఇక్కడే తన తల్లి రేణుకా ఎల్లమ్మని ప్రతిష్టించి పూజించాడు. అనంతరం దిలావర్‌పూర్ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో గల ఎతైన కొండలను దాటుకుని వెళ్లి దట్టమైన అడవుల నడుమ లోయలాంటి ప్రదేశంలో తపస్సుకు ఉపక్రమించాడు. నల్లనిరాళ్ళ మీదుగా పారుతున్న సెలయేరు..చల్లటి, వేడి, పాల వంటి నీళ్లతో కూడిన సప్తగుండాల కలిగిన ఈ ప్రాంతం ఆయనకు అమితంగా ఆకట్టుకుంది. అక్కడే స్వయంబుగా శివుడు నిలిచిఉన్నాడు. సప్తగుండాల్లో స్నానం చేసి శివయ్యను కొలవడంతో పరశురాముడి పాపం పోయింది. దీంతో ఈ ఆలయానికి, ప్రాంతానికి కదిలెగా.. ఇక్కడి శివయ్యకు పాపహరేశ్వరుడిగా పేరొచ్చింది. ఇప్పటికి భక్తులు కదిలె పాపన్నగా పిలుస్తారు. నాలుగు వందల ఏళ్లక్రితం నిమ్మరాజు పాలకులు ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది.

శ్రావణమాసాన్ని పురస్కరించుకొని మండలంలోని కదిలి పాపహరేశ్వర ఆలయానికి, శ్రీకాల్వ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి టీ.నారాయణ తెలిపారు. కదిలి, కాల్వ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పౌర్ణమి తరువాత వచ్చే రెండు సోమవారాల్లో భక్తులు కదిలి ఆలయానికి పెద్ద సంఖ్యతో తరలి వస్తుంటారని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆలయం వద్ద నిత్యాన్నదాన కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఆయన వెంట సిబ్బంది కేశవులు, అర్చకులు ఉన్నారు.

Related posts