ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యంలో ఆరేళ్ల పాపకు కూడా భద్రత లేదని వైఎస్ఆర్ టిపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… పదహారేళ్ల అమ్మాయికి, 60 ఏళ్ల బామ్మకు రక్షణ లేదని విమర్శించారు.
బాలికపై అత్యాచారం జరిగి వారం రోజులు దాటిందని.. ఇంత వరకు నిందితులను పట్టుకునే దిక్కులేదని మండిపడ్డారు. ఉన్నోనికి చట్టం చుట్టమైతే లేనోనికి న్యాయం బజార్లో దొరుకుతుందా? అంటూ వ్యాఖ్యలు చేశారు.
గ్యాంగ్ రేపులో టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుల బంధువులు ఉన్నారని, మిత్రపక్షం ఎమ్మెల్యేల కొడుకులు నిందితులుగా ఉన్నందుకేనా ఇంత జాప్యం? అని వైఎస్పార్టీపీ అధినేత్రి ప్రశ్నించారు. ఇది బంగారు తెలంగాణలో మహిళలకు దక్కుతున్న గౌరవమని సెటైర్లు వేశారు.
రాష్ట్రంలో మద్యం ఏరులై పారిస్తున్నారని తెలిపారు. డ్రగ్స్‌కు అడ్డాగా హైదరాబాద్‌ను మార్చారని దుయ్యబట్టారు. ఆడపిల్లల మానాలకు రక్షణ లేకుండా చేశారన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ఇప్పుడు నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు.