telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నవంబర్‌ 1 నుంచి … ఆరోగ్యశ్రీ పథకం .. కోలుకునేవరకు రోజుకు 225 రూపాయలు..

ysr arogya sri from november 1st

ఏపీసీఎం జగన్ నవంబర్‌ 1 నుండే వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరుల్లోని 150 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల ద్వారా మెరుగైన వైద్య సేవలందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జనవరిలో వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టాలని సీఎం సూచించారు. సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద 2వేల వ్యాధులకు చికిత్స అందించేందుకు పైలట్‌ ప్రాజెక్టు కింద పశ్చిమగోదావరి జిల్లాలో జనవరి 1 నుంచి కార్యాచరణ చేపట్టాలని జగన్‌ దిశానిర్దేశం చేశారు. ఆరోగ్య శ్రీ పథకంలో డెంగ్యూ, సీజనల్‌ వ్యాధులతో పాటు డబుల్‌ కాంక్లియర్‌ ఇంప్లాంట్‌ను చేర్చాలని సూచించారు. ఆస్పత్రుల అభివృద్ధి ద్వారా ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలు ప్రకారం మందులు అందుబాటులో ఉంచాలని సీఎం స్పష్టం చేశారు. కొత్తగా 108, 104 వాహనాలు కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

డిసెంబర్‌ 1 నుంచి ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు కోలుకునేంత వరకూ నెలకు రూ.5వేల లేదా రోజుకు రూ.225 చొప్పున అందించేందుకు ఏర్పాట్లు చేయాలని జగన్‌ సూచించారు. తీవ్ర కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారితో పాటు తలసేమియా, హీమోఫీలియా వ్యాధులతో బాధపడుతున్నవారికి రూ.10వేల ఆర్థిక సాయం వర్తింపు చేయాలని సీఎం స్పష్టం చేశారు. తీవ్ర పక్షవాతంతో కుర్చీకి పరిమితమైన వారితో పాటు రెండు కాళ్లు, చేతులు లేనివారు.. పనిచేయని స్థితిలో ఉన్నవారు, కండరాల క్షీణతతో పనిచేయలేని వారికి ఈ ఆర్థిక సాయాన్ని వర్తింప చేయాలని జగన్‌ ఆదేశించారు. వీరందరికీ జనవరి ఒకటో తేదీ నుంచి పింఛను మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. ఆస్పత్రుల్లో నాణ్యమైన మందులు ఉండేలా చూసుకోవాలన్నారు. ఆరోగ్య ఉప కేంద్రాలు, ఆస్పత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.16 వేలకు పెంచుతూ జీవో జారీ చేయాలని సీఎం ఆదేశించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు ఆస్పత్రికి వస్తే.. డబ్బుకోసం వేచిచూడాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం నుంచే కొంత మొత్తాన్ని ఇచ్చేలా చర్యలు చేపట్టాలని జగన్ అధికారులకు స్పష్టం చేశారు.

Related posts