telugu navyamedia
సామాజిక

నేడు ప్రపంచ సింహాల దినోత్సవం

నేడు ఆగస్ట్ 10న ప్రపంచ సింహాల దినోత్సవం. అడవికి రాజు సింహం దానిని మనం బంధించి బంధీని చేస్తున్నాం. స్వేచ్ఛగా అడవిలో ఠీవిగా సంచరించే ఈ మృగరాజుకు మనం సంకెళ్లు వేస్తున్నాం. అడవులను నరికివేయడం, కాలుష్యాన్ని పెంచడం, మన సరదా కోసం వాటి జూలో బంధించి వాటి మనుగడకు ముప్పు తెస్తున్నాం. ఇటీవలే ఓ జూలో సింహాలు బక్కచిక్కిపోయి.. అద్వాన పరిస్థితిల్లో కనిపించాయి. అయితే అంతరించిపోతున్న జాబితాలో ఉన్న పులులు, చిరుతపులుల సంఖ్య పెరుగుతోంది గానీ… సింహాల సంఖ్య అంతగా పెరగట్లేదు. అందుకే ప్రతి ఏడాది సింహాల దినోత్సవం జరుపుకుంటున్నాం. సింహాలను కాపాడటమే ఈ రోజు ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా సింహాలకు సంబంధించి కొన్ని ఆసక్తికర అంశాలు తెలుసుకుందాం.

*సింహాలు ఎప్పుడూ గుంపులుగా నివశిస్తాయి. వాటి గుంపును ప్రైడ్ అంటారు. తోడేళ్లలాగానే సింహాలు గుంపులుగా తిరుగుతాయి. వీటికి దట్టమైన అడవుల్లో జీవించడం నచ్చదు. గడ్డి మైదానాల్లో ఉండేందుకే ఇష్టపడతాయి. ప్రశాంతమైన విశాలమైన వాతావరణం కనిపిస్తేనే వాటికి నచ్చుతుంది.

*మగ సింహాలు 226 కేజీల (500 పౌండ్లు) బరువు పెరగగలవు. 8 అడుగుల వరకు పొడవు పెరగగలవు. మగసింహాలు తల, మెడ చుట్టూ భారీగా బొచ్చుతో ఆకర్షణీయంగా ఉంటాయి. అందువల్ల చూడటానికి అవి పెద్దవిలా కనిపిస్తాయి. సింహం పిల్లల్ని కబ్ అని పిలుస్తారు. సింహం పిల్లల్లో మగవి పెరిగే కొద్దీ తమ జీవితం తాము చూసుకుంటాయి. స్వతహాగా జీవిస్తాయి.

 

* ఆడసింహాలు కాస్త చిన్నగా ఉంటాయి. కానీ వేగంగా ఉంటాయి. ఆడ సింహాలు వాటి తోబుట్టువులతో కలిసి ఉంటాయి. అలా ఉంటూనే మొత్తం సింహాల గుంపులోనూ అవి ఉంటాయి. మగ సింహం గర్జిస్తే 8 కిలోమీటర్ల దూరం వరకూ వినిపిస్తుంది. ఇలాంటి జంతువుల్లో మగ సింహం గర్జనే అత్యంత పెద్దది. సింహాలు అడవుల్లో అయితే 12 నుంచి 16 ఏళ్లు బతుకుతాయి.

* జూల్లో పెంచితే 25 ఏళ్లు బతుకుతాయి. పులుల్లా కాకుండా చాలా సింహాలు రాత్రివేళ ఎక్కువగా వేటాడుతాయి. ఎందుకంటే రాత్రివేళ వాటి కళ్లు బాగా కనిపిస్తాయి. అది వాటికి అదనంగా కలిసొచ్చే అంశం. సింహాలు ఏ దేశాల్లో ఉన్నా వాటి రంగు దాదాపు ఒకేలా ఉంటుంది. లైట్ ఎల్లో కలర్ నుంచి డార్క్ బ్రౌన్ ఉంటుంది. ఆడ సింహం ప్రతి రోజూ 5 కేజీల మాంసం, మగ సింహం దాదాపు 7 కేజీల మాంసం తింటుందట.

సింహం కాళ్ల గోళ్లు పెద్దగా ఉంటాయి. దాదాపు 10 సెంటీ మీటర్లు ఉంటాయి. ఇవాళ్టి రోజున సింహాలను ఎలా కాపాడాలి, అందుకు ఏయే చర్యలు తీసుకోవాలి అనే అంశంపై ప్రపంచ దేశాలు చర్చిస్తాయి. అలాగే సింహాలపై పిల్లలు, విద్యార్థులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తాయి.

Related posts