telugu navyamedia
National నరేంద్ర మోదీ రాజకీయ వార్తలు

రాజకీయాలతో సంబంధం లేని బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు భయపడుతోంది: కిషన్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వం కీలక రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది.

ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర లేదా రాష్ట్ర మంత్రులు సహా పదవిలో ఉన్న ఏ రాజకీయ పార్టీ నేత అయిన సరే తీవ్రమైన నేరాల్లో అరెస్ట్ అయి 30 రోజులు జైల్లో ఉంటే పదవి కోల్పోయేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బుధవారం లోక్‌సభలో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టారు.

ఈ బిల్లుల ప్రకారం, ఐదేళ్లకుపైగా శిక్షకు దారి తీసే నేరాలపై అరెస్టై వరుసగా 30 రోజులు జైలులో ఉంటే 31వ రోజున ఆయా పదవి నుంచి ఎవరైనా స్వయంగా తప్పుకోవాల్సిందే.

రాజీనామా చేయకపోయినప్పటికీ అటువంటి నాయకులు పదవీచ్యుతులవుతారు. ఈ బిల్లుపై కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఇండియా తీవ్ర నిరసన వ్యక్తం చేయడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.

ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ‘రాజకీయాలతో సంబంధం లేని బిల్లు ఇది. కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుకు ఎందుకు భయపడుతోంది.

గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నట్లు కాంగ్రెస్ పరిస్థితి ఉంది.

కోర్టు తీర్పు తర్వాతే అమిత్ షా ఎన్నికల్లో పోటీ చేశారు. అద్వానీ పై ఆరోపణలు వస్తే రాజీనామా చేసి తర్వాత ఎన్నికల్లో పోటీ చేశారు.

నైతిక విలువలు కట్టుబడి నాడు అమిత్ షా రాజీనామా చేశారు. ఆరోపణలు వచ్చినప్పుడు స్వచ్ఛందంగా పదవి నుంచి తొలగి పోవాలి.

అరవింద్ కేజ్రీవాల్ జైల్లో రివ్యూమీటింగ్ పెట్టాడు. ఆరు నెలలు జైలు నుంచే సీఎంగా పరిపాలన చేసి వ్యవస్థల పరువు తీశాడు.

జైలు కు వెళ్లి కూడా తమిళ నాడు మంత్రి సెంథిల్ బాలాజీ పదవిలో కొనసాగాడు. ఈ బిల్లుపై చర్చ జరపాలని జేపీసీకి పంపాం.

దీనిపై మేధావులు,విద్యావంతులు ప్రజలు చర్చించాలి. నైతిక విలువల రాజకీయాల కోసమే ఈ బిల్లు తీసుకువచ్చాం’ అని స్పష్టం చేశారు.

Related posts