ఆర్టీసీలో 151 మండల మహిళా సంఘాల గ్రూప్‌లకు (అద్దె బస్సుల యజమానులకు) రూ.1.05 కోట్ల రూపాయల చెక్కును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క అందజేశారు.
అనంతరం మహిళా రచయితలు, కవులు రాసిన మహాలక్ష్మి (మహిళా సాధికారత లో ప్రగతి చక్రాలు) పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ గత ప్రభుత్వం మహిళా సమాఖ్యలను పట్టించుకోలేదని విమర్శించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందని ఇప్పటికే మహిళల అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. త్వరలో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని వెల్లడించారు.
అవకాశాలు ఉన్న ప్రతీ దగ్గర వ్యాపారం కోసం మహిళా సమాఖ్యలకు ఇస్తామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరీమణులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు.
మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను గ్రౌండ్ లెవెల్లో తెలిసేలా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.
ఈనెల 10 నుంచి 16 వరకు రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీలేని రుణాల చెక్కుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ ప్రభుత్వం ప్రజలదన్నారు. కుటుంబ పెద్దలు ఆర్థికంగా ఎదిగేలా చేస్తే.. రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.
మహిళా అభివృద్ధిలో తెలంగాణను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.