telugu navyamedia
తెలంగాణ వార్తలు

టీఆర్ఎస్ గడ్డపై ప్రకంపనలు..

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి షాకులమీద షాకులు తగులుతున్నాయి. నిన్నమొన్నటిదాకా టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు.. ఎదురులేదు… కానీ రోజులు మారాయి… పరిస్థితులు మారాయి. టీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలవడమేకాదు… తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రపోషించిన కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆపార్టీకి రాజీనామా చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పార్టీని వీడాల్సిన పరిస్థితులు అనివార్యమయ్యాయని సర్థార్ రవీందర్ సింగ్ చెప్పుకొచ్చారు. సర్థార్ రవీందర్ సింగ్ రాజీనామాతో కరీంనగర్ లో అధికార పార్టీ టిఆర్ఎస్ కు గట్టి షాకేనని చెప్పాలి. తీవ్ర మనస్తాపానికి గురైన సర్థార్ సింగ్ టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశానని ప్రకటించారు. ఈమేరకు ఆయన తెలంగాణ రాష్ట్రసమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు తన రాజీనామా పత్రాన్ని పంపారు.


తెలంగాణ ఉద్యమంలో ముందు ఉండి పోరాడే వారికి టిఆర్ఎస్ పార్టీ అవకాశం ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నెరవేర్చలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో కరీంనగర్ నుంచి కీలక పాత్ర పోషించిన రవీందర్ సింగ్ ఆపార్టీని వీడటాన్ని కార్యకర్తలు, నాయకులు జీర్ణించుకోలేకపోయారు. ఎమ్మెల్సీ ఎన్ని్కల్లో టీఆర్ఎస్ పార్టీనాయకులతో గాకుండా… ప్రజల మద్దతుతోనే నడిచొచ్చి నామినేషన్ దాఖలు చేశానని పేర్కొన్నారు. అధిష్టానం తనను గుర్తించలేదని , కొత్తగా వచ్చినవారికి ప్రాధాన్యత ఇవ్వడంతో మనస్తాపానికి గురయ్యానని పేర్కొన్నారు. నిజమైన కార్యకర్తల్ని టిఆర్ఎస్ పార్టీ గుర్తించడం లేదని రవీందర్ సింగ్ తన మనోభావాన్ని వ్యక్తంచేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కరీంనగర్ మాజీమేయర్ సర్థార్ రవీందర్ సింగ్ ప్రజాప్రతినిధుల మద్ధతు కూడగట్టుకునే ప్రయత్నంచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట నడిచి వచ్చేందుకు సుముఖత వ్యక్తంచేశారు. టీఆర్ఎస్ తిరుగుబాటు దారులు సర్థార్ కు మద్దతు ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా సాగబోతున్నాయి.

తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీలో చీలిక ఏర్పడటంతో పలుచనయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ లో ఇటీవల బీజేపీ విజయభేరిమోగించడం…. తాజాగా కరీంనగర్ మాజీ మేయర్ సర్థార్ సింగ్ రాజీనామాతో టీఆర్ఎస్ కు భారీ ఇబ్బందేనని తెలుస్తోంది.

కరీంనగర్ జిల్లాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన మాజీ మేయర్ సర్థార్ రవీందర్ సింగ్ కు బీజేపీ తరఫున మద్ధతు ఇచ్చేందుకు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ముందుకొచ్చారు. కరీంనగర్ జిల్లా తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టులాంటిది. క్రమేణ టీఆర్ఎస్ ప్రాభవం మసకబారుతున్నట్లు తెలుస్తోంది.

కరీంనగర్ జిల్లాలో భారతీయ జనతాపార్టీ పాగా వేసిందనే చెప్పాలి… కరీంనగర్ ఎంపీ స్థానాన్ని బండి సంజయ్, హుజురాబాద్ శాసనసభ స్థానాన్ని ఈటెల రాజేందర్ కైవసం చేసుకోవడం… తదనంతర పరిణామాలు బీజేపీకి అనుకూలంగా మారాయి. డిసెంబరులో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఎలాంటి మార్పులకు సంకేతంగా నిలుస్తాయోనని ఆసక్తిరేకెత్తిస్తోంది.

Related posts