ఖమ్మం జిల్లాలో దుండగుల దాడిలో దారుణంగా హత్యకు గురైన తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో తమ్మినేని కృష్ణయ్య మృతదేహం వద్ద మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాలం చెల్లిన కొందరు అరాచకాలతో ఘాతుకాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు.
గత 30 ఏళ్లుగా హత్యారాజకీయాలకు జిల్లా దూరంగా ఉందన్నారు. కార్యకర్తలు ఎవరూ ఎలాంటి చర్యలకు దిగొద్దన్న తుమ్మల.. హత్యా రాజకీయాలు జరిగితే జిల్లా అభివృద్ధి కుంటుపడుతుందని గుర్తుచేశారు.
తమ్మినేని కృష్ణయ్య హత్యకేసులో ఉన్నవారు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు, టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్యను దుండగులు దారుణంగా హత్య చేశారు. ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలో బైక్పై వెళ్తోన్న ఆయనను దుండగులు ఆటోతో ఢీకొట్టి అనంతరం వేటకొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు. ఈ దాడిలో ఆరుగురు పాల్గొనున్నట్లు తెలుస్తోంది. తెల్దారుపల్లి శివారులోని రోడ్డుపై ఈ దాడి ఘటన జరిగింది.
కాగా..ఈ హత్యకు నిరసనగా తెల్దారుపల్లిలో తమ్మినేని కోటేశ్వరరావు ఇంటితో పాటు గ్రామంలోని సీపీఎంకు చెందిన నాయకుల ఇళ్లపై తమ్మినేని కృష్ణయ్య అనుచరులు దాడికి దిగారు.
గ్రామంలోని సీపీఎం జెండా దిమ్మెలను ధ్వంసం చేశారు. తమ్మినేని కృష్ణయ్య హత్యకు ప్రతీకారంగా తమ్మినేని కోటేశ్వరరావుకు చెందిన గ్రానైట్ కంపెనీపై కృష్ణయ్య అనుచరులు దాడి చేశారు. గ్రానైట్ కంపెనీలో ఉన్న ప్రొక్లెయినర్ ను దగ్దం చేశారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బాబాయ్ కొడుకే తమ్మినేని కృష్ణయ్య. కొంత కాలం క్రితం తమ్మినేని కృష్ణయ్య సీపీఎంను వీడి టీఆర్ఎస్ లో చేరారు. సీపీఎంకు చెందిన వారే ఈ హత్యచేశారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.


బీజేపీ ఎంపీ సోయం మాట తప్పారు: ఎమ్మెల్యే జోగు రామన్న