తెలంగాణ రాష్ట్ర గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ఆర్జేసీ సెట్-2020ని వాయిదా వేస్తున్నట్లు గురుకుల విద్యాలయాల సంస్థ ఒక ప్రకటనలో పేర్కొన్నది. రాష్ట్రంలోని 35 గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం గురుకుల విద్యాలయ సంస్థ ప్రతి ఏడాది ఈ పరీక్షను నిర్వహిస్తుంది. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి 2020, మే 10న పరీక్ష నిర్వహించాలని గతంలో నిర్ణయించారు.
అయితే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉండటం, ఈ లాక్‌డౌన్ ఎప్పటివరకు కొనసాగుతుంది అనే విషయంలో స్పష్టత లేకపోవడం లాంటి పరిణామాల నేపథ్యంలో పరీక్షను వాయిదా వేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఈ ప్రవేశ పరీక్షను తిరిగి ఎప్పుడు నిర్వహించేది లాక్‌డౌన్ తర్వాత ప్రకటించనున్నట్లు తెలిపారు.

