ఖైరతాబాద్ ద్వాదశ ఆదిత్య మహాగణపతి నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయింది. మధ్యాహ్నం ఒంటిగంటన్నర ప్రాంతంలో ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెంబర్ 6 వద్ద ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడిలోకి చేరాడు. ఈ సారి వినాయకుడు పూర్తిగా మునగటం విశేషం. శ్రీద్వాదశాదిత్య మహాగణపతిని సాగనంపటానికి భారీగా భక్తులు తరలివచ్చారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి.
ఉదయం 8 గంటలకు ప్రారంభమైన గణేషుడి శోభాయాత్ర ఎన్టీఆర్ మార్గ్ వరకు సుమారు ఐదు గంటల పాటు కొనసాగింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అర్చకులు గంగమ్మకు పూజలు చేశారు. అనంతరం ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబర్-6 వద్ద మహాగణపతిని నిమజ్జనం చేశారు. 61 అడుగుల ఎత్తు, 45 టన్నుల బరువున్న మహాగణపతిని నిమజ్జనం చేసేందుకు 400 టన్నుల సామర్థ్యం కలిగిన క్రేన్‌ను ఉపయోగించారు.