telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఇది పదవి కాదు, కార్యకర్తకు దక్కిన గౌరవం – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రామచందర్ రావు

పార్టీ కోసం నేను చేసిన కృషికి నాకు దక్కిన గౌరవం ఇది. నాకు ఇచ్చింది పదవి కాదు. కార్యకర్తకు దక్కిన గౌరవం ఇది.

లక్షలాది మంది కార్యకర్తలకు దక్కిన గౌరవం ఇది’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు అన్నారు.

ఈరోజు (శనివారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడిగా రామచందర్ రావు బాధ్యతలు స్వీకరించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నలబై ఐదు లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీ బీజేపీ అని తెలిపారు. ఎంతోమంది కార్యకర్తల త్యాగం ఉందన్నారు.

దేశ వ్యాప్తంగా 14 కోట్ల సభ్యత్వం ఉన్న పార్టీ బీజేపీ అని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ , బీఆర్ఎస్‌లకు ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని వాళ్ళు నిలబెట్టుకోలేదని విమర్శించారు. బీఆర్ఎస్ , కాంగ్రెస్‌లు రైతులను , విద్యార్థులను , నిరుద్యోగులను, మహిళలను మోసం చేసాయని మండిపడ్డారు.

నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి తన నిస్సహాయతను ఒప్పుకున్నారన్నారు. రైతాంగాన్ని మోసం చేస్తే వాళ్ళ ఉసురు తగులుతుందని వ్యాఖ్యలు చేశారు.

లోకల్‌బాడీ ఎన్నికల్లో ప్రజలు ఆ రెండు పార్టీలకు బుద్ధి చెబుతారని అన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత రేవంత్ రెడ్డికి కనబడటం లేదని.. దీని మీద బీజేపీ చర్చకు సిద్ధమని.. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీనిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.

బీజేపీ మీద ఆరోపణలు చేసే ముందు వారు పునరాలోచన చేసుకోవాలని హితవుపలికారు. ఖర్గే, రేవంత్ , కాంగ్రెస్ పెద్దలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా చీటింగ్ కమిటీ అంటూ కామెంట్స్ చేశారు.

నెక్స్ట్ ప్రభుత్వం బీజేపీదే అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణాలో బీజేపీకి ప్రజలు 90 సీట్లు ఇవ్వబోతున్నారన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ , బీఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్ది చెప్పారని అన్నారు. జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్‌కు వచ్చిన సీట్లు రెండే అని అన్నారు.

ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిన ఘనత బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలదంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు విరుచుకుపడ్డారు.

Related posts