telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సినిమా వార్తలు

థియేటర్లు బంద్ నిర్ణయం వాయిదా: కె.ఎల్. దామోదర ప్రసాద్

తెలుగు సినిమా థియేటర్లు  జూన్ 1 నుండి పర్సంటేజ్ సిస్టమ్ కు అంగీకరించకపోతే థియేటర్లు బంద్ చేస్తామని కొద్ది రోజుల ముందు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎగ్జిబిటర్స్ ప్రకటించారు.

అయితే సింగిల్ థియేటర్ల యజమానులు ఇచ్చిన ఈ అల్టిమేటమ్ పై నిర్మాతలు, పంపిణీదారులు మల్లగుల్లలు పడ్డారు.

రెంట్ కాకుండా పర్సంటేజ్ విధానం కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదువుతాయనే దానిపై వీరు కొద్ది రోజులుగా చర్చలు జరిపారు.

అయితే ఇవేవీ ఓ కొలిక్కి రాలేదు. ఇక శుక్రవారం సాయంత్రం ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ థియేటర్ల బంద్ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ఎక్కడ నుండి ఆ ప్రపోజల్ వచ్చిందో ఆరా తీయమంటూ స్టేట్ హోమ్ సెక్రటరీని కోరడంతో ఈ వివాదం వేడెక్కింది.

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా జూన్ 12న విడుదల కాబోతున్న నేపథ్యం లో ఆ సినిమా నిర్మాతలను ఇబ్బంది పెట్టాలనే ఎగ్జిబిటర్స్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? అనే అనుమానాలూ కొందరు వ్యక్తం చేశారు.

ఎందుకంటే గత ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సినిమా ‘బ్రో’ విడుదల సమయంలోనూ ఇలానే సినిమా టిక్కెట్ రేట్ల విషయంలో తాత్సారం చేసింది. చివరకు ఆ సినిమాను విడుదల చేసిన తర్వాత టిక్కెట్ రేట్ల పెంపు విషయంలో నిర్ణయం తీసుకుంది.

శనివారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, నిర్మాతల మండలి, ది తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు చెందిన కార్యవర్గం సమావేశమైంది.

రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్స్ తో వీరు చర్చలు జరిపారు. అనంతరం జరిగిన మీడియాతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కె.ఎల్. దామోదర ప్రసాద్ మాట్లాడారు.

గత కొంతకాలంగా తమ మధ్య ఉన్న సమస్యలపై చర్చించామని, ఈ నెల 30న ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ను ఏర్పాటు చేసి, ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని, థియేటర్స్ పర్సంటేజ్, రెంటల్ విధానంపై వారు కూలంకషంగా చర్చలు జరిపిన తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటామని, అంతవరకూ థియేటర్ల బంద్ ఉండదని స్పష్టం చేశారు.

Related posts