telugu navyamedia
సినిమా వార్తలు

“అద్భుతమైన సజీవ పాత్ర రావణాసురుడు” – ఎన్ .టి .ఆర్

నేను గత 12 సంవత్సరాల నుంచి నటుడుగా ఉన్నాను. మీ అభిమానం చూరగొన్నాను. వెండి తెర మీద నేను ఇలా ఉండడానికి, మీ అభిమానం సంపాదించగలడానికి కారణం నేను ధరించిన పాత్రలేనని నా విశ్వాసం.

అభిమాన పాత్ర ధరించి అభిలాష తీర్చుకొనడంకన్నా ఏ నటుడూ ఆశించేది మరొకటి లేదు. నటనకు చోటు దొరికే బలమైన పాత్రలంటే నాకు చాలా అభిమానం. కాలేజీ రోజుల్లో నాటకాలు వేసేటప్పుడు కూడా అంతే. ఆడవేషం వేయమంటే ఎక్కడ లేని పౌరుషమూ వచ్చేది. వేడి, వాడిగల పాత్రలు నాకు చాలా ఇష్టం. బెజవాడ కాలేజీలో మా మాష్టారు కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు నా చేత ఆడవేషం వేయించాలని పట్టుపట్టడం… అదో గమ్మత్తు కథ! రాచమల్లుని యుద్ధ శాసనంలో నాగమ్మ పాత్ర నాకు ఇచ్చారు. పౌరుషానికి కావాలంటే మీసం తీయకుండానే ఆ పాత్ర ధరిస్తానని నేను భీష్మించాను. అలా భీష్మించుకునే అలవాటు అప్పటికి, ఇప్పటికీ నాలో వుంది. భీష్ముని వంటి గంభీర పాత్రలన్నా వీర గాంభీర్యాలు, ఔదార్యం ఉట్టిపడే పాత్రలన్నా నాటికీ నేటికీ నాకు మక్కువ. తొలిసారి ‘భూకైలాస్’ చిత్రంలో రావణపాత్ర ధరించినప్పటి నుండి నాకు అదో విశిష్టమైన పాత్రగా మారింది .

‘రావణ’ అనగానే స్ఫురించేది వికృతమైన ఎదో భయంకర స్వరూపం, స్వభావం. సామాన్య దృష్టికి ‘రావణుడు’ ఉగ్రకోపి, క్రూరుడు అయినరాక్షసుడుగా కన్పిస్తాడు. అతని వంశం సాక్షాత్తూ బ్రహ్మ వంశం. పులస్త్య బ్రహ్మ పౌత్రుడు. విశ్వవసువు పుత్రుడు. పుట్టుకచేత ఈతడు పుణ్యాత్ముడు. అంతే అని కొట్టివేయడం సాధ్యం గాదు. సద్బ్రాహ్మణ వంశ సంజాతుడయిన దశకంఠరుడు పునీతమైన జీవితం గడిపినవాడు.  సూర్యోదయాత్పూర్వమే నవకోటి శివలింగాలను స్వకల్ప మంత్రోచ్చారణతో పూజించే శివ పూజా దురంధరుడు రావణుడు. తలచినదే తడవుగా కైలాసవాసిని ప్రత్యక్షం చేసుకోగల్గిన మహాతపస్వి. ఇందుకు తగిన పురాణ కావ్య నిదర్శనాలు జనశ్రుతులు ఎన్నో ఉన్నాయి. దశకంఠ రావణ విరచితమైన ‘మహాన్యాసం’ వల్లించదనిదే మహాదేవుని అర్చన పూర్తి కాదు. అతడెంత సంస్కృతీ పరిజ్ఞానం కలవాడో చూడండి. అతని పాండితిలో లౌకిక, పారలౌకిక శిఖరాలు మహోన్నతమైనవి. ఆధ్యాత్మిక చింతన, తనకు అతీతమైన దైవత్వం పట్ల భక్తి విశ్వాసాలు అతనిలో ఉన్నాయి.

రసజ్ఞుడుగా, కళాప్రపూర్ణుడుగా రావణుడు అద్వితీయుడు. త్రిలోకాలలోనే సాటిలేని వైణికుడు. సామవేదకర్త. తనపై అలిగిన శంకరుని ప్రీతికి పొట్టచీల్చి ప్రేగులతో రుద్రవీణ కట్టి జీవనాదంతో పార్వతీశుని తన ముందుకు రప్పించుకొనగల్గిన సంగీత కళాతపస్వి. ఇక శాస్త్రజ్ఞుడుగా మాత్రం రావణుడు సామాన్యుడా? ఈనాడు మన శాస్త్రజ్ఞులు చేరాలని కలలకనే నభోమండలాలన్ని ఏనాడో చూచిన శాస్త్ర పరిజ్ఞాని. వాతావరణాన్నీ, ఋతుక్రమాన్నీ హస్తగతం చేసుకుని తన రాజ్యాన్ని సుభిక్షం చేసుకున్న స్థితప్రజ్ఞుడు. అనేక మారణాయుధాలను, మంత్రతంత్రాలను, క్రియా కల్పవిద్యలను, ఆకళించుకున్న శాస్త్రవేత్త. పుష్పక విమానంలో వాయుగమనం చేశాడని, దివిజ లోకాల మీద దండెత్తి అష్ట దిక్పాలకులను తన పాదాక్రాంతులుగా చేసుకున్నాడని వర్ణించారు. మేఘనాథుని జనన కాలంలో వక్రించిన శనిపై కినిసి గదాఘాతంతో కుంటివానిని చేయడమే అతని జ్యోతిష శాస్త్ర ప్రజ్ఞకు నిదర్శనం. ఆవేశంలో ముక్కోటి ఆంధ్రులను తలపించే ఈ రావణబ్రహ్మ ఐరావతాన్నే ఢీకొనడం, అలిగినవేళ కైలాసాన్నే కంఠాలపై మోయడం అతని భుజబలదర్పానికి గుర్తులు.

రావణుడు కారణజన్ముడైన మహనీయుడు.
ఈ రామాయణ నిదర్శనాల వల్ల మనకు కనుపించే వ్యక్తి యెవరు? ఆ కనుపించే రావణుడు ఎటువంటివాడు? బ్రహ్మతేజస్సుతో నిర్వక్ర పరాక్రమ బలదర్పితుడై, మహాపండిత ప్రకాండుడై, శివపూజా ధురంధరుడై, శాస్త్రవేత్త అయిన మహా తపస్వి.  కాని… ఇంతటి మహో దాత్తుడు రాక్షసుడుగా, శరుడుగా పరిగణింపబడటానికి గల కారణమేమిటి? అతని వైష్ణవ ద్వేషం ముఖ్యంగా ఒక కారణం. తాను శైవుడు కావడంలో తప్పు లేదు. ఇష్టదైవాన్ని నమ్మి కొలవడంలో అపకారమూ లేదు. కాని తన మతాన్ని ఇతరుల మీద రుద్ది పరమత ద్వేషంతో వైష్టవ పూజలాటంక పరచి విష్ణుద్వేషిగా హింసాకాండకు ఉపక్రమించడమే అతడంటే మనం భయభ్రాంతులను అయ్యేటట్లు చేసినది. పరనారీ వ్యామోహమే నలకూబరుని శాపానికి దారితీసింది. అతని పతనానికి కారణమైనది. ఈ రెండూ అతనిపై దెబ్బతీసినట్లు మరేవీ తీయలేదు. అహంభావంలో కూడా అతనికతనే సాటి. తనలో తనకు ఎంత నమ్మకమున్నా ఇతరులంటే నిర్లక్ష్యం, చులకన చేయడం, నందీశ్వరుని శాపానికి దారి తీసింది. అతని వంశమంతా వానర బలంతో హతమైనది.

లక్ష్మీ అవతారమూర్తి అయిన మాతలుంగిని చెరపట్టబోయనప్పుడు పరాజయం పొందడం, వేదవతిగా ఉన్న ఆమెను తాను దక్కించు కొనలేకపోడం, సీతగా జన్మించిన ఆమెను స్వయంవరంలో సాధించ బూని పరాభూతుడు కావడం, కడకు సీతను లంకలో చెఱపెట్టే వరకు అతడు మూర్ఖించడం- ఇవన్నీ పై మహత్తర గుణాలతో జోడించి చూస్తే రావణుడు ఎలాంటి వాడుగా మనకు కనిపిస్తాడు? నాకు అతడు దుర్మార్గుడుగా కనిపించడు. పట్టుదలగలవాడుగా కనిపిస్తాడు. అతనిలో లేని రసం లేదు. కావలసినంత సరసం, ఉండరానంత విరసం ఉన్నాయి. జీవన్నటులలలో మేటి. అటువంటి పాత్ర అపురూపమైనదని నా నమ్మకం. అలాంటి పాత్ర ధరించాలని నా అభిలాష. అదే నన్ను ఈ పాత్రధారణకు ప్రోత్సహించింది.

రావణుడు వికృతాకారుడు కాదు. పెద్దపొట్టతో, బుర్రమీసాలతో, అనవసర ఘింకారాలతో వికట ప్రవృత్తి గలిగిన మదోన్మత్తుడు, అలక్షణుడు కాదు. మానవాతీతుడైన ఒక మహత్తర వ్యక్తి, శక్తి. కుండెడు పాలలోనయినా ఒక విషం బొట్టు పడితే పాలన్నీ విషం అయినట్లు ఇన్ని సద్గుణాలు కలిగినా, సద్బ్రాహ్మణ వంశసంజాతుడయిన రావణునిలో ఒక్క దుర్గణమే అతని నాశనానికి దారితీసింది. రావణ పాత్ర సర్వావేశ సంకలితం. ఆనందం, ఆవేశం; అనుగ్రహం, ఆగ్రహం; సహనం, అసూయ; భక్తి, ధిక్కారం… ఇన్ని ఆవేశాలు, కావేషాలు రావణుని తీర్చిదిద్దాయి. ఈ పాత్ర సజీవం కావడం వల్లనే నన్నింతగా ఆకర్షించింది. ఈ మహాపాత్ర ధరించగలిగినందుకు ధన్యుడిననుకుంటాను. రావణుని పరస్పర విరుద్ధ ప్రవృత్తులన్నీ వ్యక్తీకరించడానికి ప్రయత్నించాను. పౌరాణిక గాథలలో కనుపించే అద్భుతమైన సజీవ, పాత్రలలో రావణ పాత్ర ముఖ్యమైనది. అందుకే అది. నా అభిమాన పాత్ర అయింది. (1961 జనవరి 18 న “ఆంధ్ర సచిత్ర వారపత్రిక” లో ప్రచురితమైన వ్యాసం.

Related posts