telugu navyamedia
వార్తలు

మాయల లోకంలో మహాత్ముడు – పట్టాభిరామ్‌కు అక్షరనివాళి

మాయలు చేసి చేసి
తానే మాయమయ్యాడు..!

(పట్టాభికి అక్షరనివాళి)

ఆయన
చెయ్యి తిప్పితే తంత్రం..
నోరు విప్పితే మంత్రం..
ఒకేసారి విప్పి తిప్పితే
పంచతంత్రం..
మొత్తానికి మాయగాడు..
ఆపై మాటలోడు..
మాయతో అలరిస్తాడు..
మాటతో ఆకట్టుకుంటాడు..
మాటల మాయతో
మనుషుల్ని మాయం చేస్తాడు
మనసుల్ని మార్చేస్తాడు..!

పట్టాభిరామ్..
మన చిన్ననాటి మాయలోడు..
మనం పెరిగి పెద్దయ్యే పాటికి
మాటలోడు..
మెజీషియన్ గా మాయమై
సైక్రియాస్టిస్టుగా ప్రత్యక్షమై..
ఎందరినో అలరించి..
ఇంకెందరినో
చక్కని దారిలో పెట్టి..
ఇప్పుడు అందరికీ
సెలవు చెప్పి
శాశ్వతంగా అదృశ్యమైపోయాడు..
అబ్రకదబ్ర..అబ్రకదబ్ర
అని ఎన్నిసార్లు పిలిచినా
అబ్బా..తిరిగి రాలేని లోకానికి!

ఎంత చదివేశాడో..
డిగ్రీలు బోలెడు..
కెరీర్ బారెడు..
పీహెచ్డి చేసి ఆగలేదు..
సైకాలజీ..ఫిలాసఫీ..
జర్నలిజం అన్నీ చదివేశాడు
ప్రపంచం చుట్టేశాడు..!

ఆయన మేజిక్ చూస్తే సరదా..
మాట వింటే మజానే సదా..
చేతిలోనే మ్యాజిక్ అనుకుంటే
స్వరంలో మ్యూజిక్ వినిపించాడు..
చేయి తిప్పితే ఎలాంటి వస్తువైనా తన వశం..
మాట వింటే ఎంతటివారైనా
పరవశం..తన వశం..
అదే హిప్నాటిజం..
అది అలవోకగా చెయ్యడం
పట్టాభి ఇజం..!

ఇష్టమైనది మంత్రం..
ఇష్టపడి రాసింది
చాణక్యతంత్రం..
మ్యాజిక్కులో పరమాత్మా..
లిఖించింది
మ్యాజిక్ ఆఫ్ మహాత్మా..
తాను ఆచరించిన దానికే
పుస్తకరూపం..
కష్టపడి పనిచేయొద్దు..
ఇష్టపడి పనిచేయండి
ఇలా ఇంకా ఎన్నో పుస్తకాలు..
వైజ్ఞానిక హిప్నాటిజం..
సర్దుకుపోదాం రండి
కౌన్సిలింగ్ సీక్రెట్స్
కాలేజీ క్యాంపస్..
నేను సైతం
అన్నీ ఆయన మేధస్సుకే అంకితం..!

–  సురేష్ కుమార్,  జర్నలిస్ట్

 

Related posts