వైసీపీ అధినేత జగన్ కు సంబంధించిన అక్రమాస్తుల కేసులో ప్రముఖ సిమెంట్ సంస్థ దాల్మియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఆ సంస్థకు చెందిన రూ.793 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేయడాన్ని అడ్జుకేటింగ్ అథారిటీ సమర్థించింది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో దాల్మియా సిమెంట్స్‌కు కడప జిల్లాలో 407 హెక్టార్ల సున్నపురాయి గనులను ప్రభుత్వం లీజుకు కేటాయించింది.
అందుకు ప్రతిఫలంగా ఆ సంస్థ, జగన్‌కు చెందిన కంపెనీలలో భారీగా పెట్టుబడులు పెట్టిందని, ఇది క్విడ్ ప్రో కో కిందకు వస్తుందని సీబీఐ తన చార్జిషీట్లలో ఆరోపించింది.
ఈ లావాదేవీల ద్వారా మనీలాండరింగ్ జరిగిందనే అభియోగాలపై ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
ఈ కేసు విచారణలో భాగంగా ఈడీ, ఈ ఏడాది మార్చి 31న దాల్మియా సిమెంట్స్‌కు చెందిన రూ.793 కోట్ల ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. ఇందులో రూ.377.26 కోట్ల విలువైన భూములు కూడా ఉన్నాయి.
ఈడీ చర్యను సవాల్ చేస్తూ దాల్మియా సంస్థ అడ్జుకేటింగ్ అథారిటీని ఆశ్రయించింది. కేసును లోతుగా పరిశీలించిన అథారిటీ, ఈడీ వాదనలతో ఏకీభవిస్తూ జప్తును ఖరారు చేస్తూ తుది నిర్ణయం ప్రకటించింది.
కాగా, అథారిటీ తీర్పు తమ వ్యాపార కార్యకలాపాలపై, ఆర్థిక లావాదేవీలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపబోదని దాల్మియా సిమెంట్స్ సంస్థ స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఒక ప్రకటనలో తెలియజేసింది.
తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం తప్పే.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు!