telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రెబల్స్ తో ఇంకా .. ఇబ్బందిపడుతూనే ఉన్న యడ్డి..

yadurappa karnataka

ఉప ఎన్నికల్లో బీజేపీకి పలుచోట్ల రెబెల్స్‌ బెడద పీడిస్తోంది. డిసెంబరు 5న జరగబోయే 15 అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికల నామినేషన్ల పర్వం సమాప్తం కాగా, ప్రచారం ఆరంభమైంది. మూడు ప్రధాన పార్టీలు త్రిముఖ పోటీలో తలపడుతున్నాయి. నేటితో (బుధవారం)తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. బీజేపీ అధికారంలోకి రావడానికి కారణమైన అనర్హత ఎమ్మెల్యేలకు టికెట్‌ ఇచ్చి గెలిపించుకుంటామని సీఎం యడియూరప్ప పదేపదే ప్రకటించారు. ఆ నియోజకవర్గాల్లో బీజేపీ నాయకులకు ఇది మింగుడుపడలేదు. పార్టీని నమ్ముకుని ఇన్నేళ్ల నుంచి పనిచేస్తుంటే కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఎలా ఇస్తారంటూ రెబెల్స్‌ ప్రశ్నిస్తున్నారు. కొంతమంది స్వతంత్ర అభ్యర్థులుగా ఈ ఉప ఎన్నికల్లో నామినేషన్లు కూడా వేశారు. వీరిని ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప దగ్గరి నుంచి పార్టీలోని సీనియర్‌ నేతలంతా సముదాయించే పనిలో పడ్డారు. మరికొందరు నాయకులు సహాయ నిరాకరణ బాటలో ఉన్నారు

యడియూరప్ప రెబెల్స్‌ అభ్యర్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా హొసకోట నుంచి స్వతంత్ర అభ్యర్థి శరత్‌ బచ్చేగౌడ వంటివారు వెనకడుగు వేయడం లేదు. హొసపేటలో కవిరాజ్‌ అరస్‌ రెబెల్‌గా పోటీలో ఉన్నారు. హీరేకరూర్‌లో జేడీఎస్‌ అభ్యర్థిగా మఠాధిపతి శివలింగ శివాచార్య స్వామీజీ బరిలో నిలవడంతో ఓట్ల చీలికకు అవకాశం ఏర్పడింది. బెళగావి జిల్లా గోకాక్‌ నియోజకవర్గంలో జారికిహోళి కుటుంబం నుంచి ఇద్దరు సోదరులు పరస్పరం ప్రత్యర్థులుగా బరిలో నిలిచారు. బీజేపీ అభ్యర్థిగా రమేశ్‌ జారకిహోళి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా లఖన్‌ జారకిహోళి నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నారు. శివాజీనగర అనర్హత మాజీ ఎమ్మెల్యే రోషన్‌ బేగ్‌కు బీజేపీ మొండిచేయి చూపడంతో కంగుతిన్నారు. ఆయన పోటీలోనే లేరు. ఐఎంఏ కేసులో నిందితునిగా ఉండడం ఆయనను ఒంటరి చేసింది. ఆయన చివరకు జేడీఎస్‌ టికెట్‌ ఆశించినా ఫలితం లేకుండా పోయింది.

Related posts