ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైలు నిర్మాణానికి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది.
వీటి నిర్మాణానికి సంబంధించిన టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఆ క్రమంలో ప్రభుత్వం శుక్రవారం టెండర్లు పిలవనుంది.
రూ.21,616 కోట్లతో విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు టెండర్లను ఆహ్వానించనుంది.
అందులో రూ. 10,118 కోట్లతో విజయవాడ, రూ. 11,498 కోట్లతో వైజాగ్ మెట్రోలకు టెండర్లు పిలవనున్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఫిఫ్టీ, ఫిఫ్టీ భాగస్వామ్యంతో నిర్మించనున్నారు.
వైజాగ్ మెట్రో రైలుకు విఐఎంఎంఆర్డీఏ నుంచి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ. 4,101 కోట్ల నిధులు మళ్లించనున్నారు.
అలాగే విజయవాడ మెట్రోకు సీఆర్డీఏ నుంచి రూ.3,497 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా నిధులు మళ్లించనున్నారు.