సోమవారం కాంగ్రెస్ వర్గాలు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా చలో ప్రగతిభవన్ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించాయి. మాజీ మంత్రి షబ్బీర్ అలీ నివాసంలో ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు దయాసాగర్, ఇతర నేతలు సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించారు. సీఎం అధికారిక నివాసం ప్రగతిభవన్ ముట్టడికి అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు చేశారు. ఆర్టీసీ ఎండీని నియమించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించినప్పటికీ అమలు చేయకుండా సీఎం కేసీఆర్ న్యాయవ్యవస్థను అగౌరవపరిచారని ఈ సందర్భంగా నేతలు ఆరోపించారు.
సామాన్య ప్రజల ఇబ్బందులను, ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.