ఒంటరిగా పోటీ చేసిన చరిత్ర టీడీపీకి లేదని… ప్రతి ఎన్నికలో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ గెలిచిందంటూ తెలుగుదేశంపై విపక్ష నేతలు అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విమర్శలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముగింపు పలికారు. రాబోయే ఏపీ శాసనసభ, సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఏ పార్టీతో పొత్తు లేకుండా, ఒంటరిగా బరిలోకి దిగింది. చరిత్రలో తొలిసారి సింగిల్ గా పోటీ చేస్తోంది.
ఇప్పటి వరకు టీడీపీ పొత్తు పెట్టుకున్న పార్టీలు ఇవే:
1983 (టీడీపీకి తొలి ఎన్నికలు) – సంజయ్ విచార్ మంచ్ (మేనకాగాంధీ అధ్యక్షురాలు)
1985 – బీజేపీ, వామపక్షాలు
1989 – బీజేపీ, వామపక్షాలు
1994 – వామపక్షాలు
1999 – బీజేపీ
2004 – బీజేపీ
2009 – టీఆర్ఎస్, వామపక్షాలు
2014 – బీజేపీ
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు – కాంగ్రెస్, సీపీఐ
2019 – రెండు రాష్ట్రాల్లో ఒంటరిగా
అయితే దీనిపై కూడా విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మంగళగిరిలో లోకేష్ పై జనసేన పోటీకి దిగకపోవటంపై లోపాయకారి ఒప్పందం ఉందని, ఈ రెండు పార్టీలు తెరవెనుక కూటమిగానే ఉంది పోటీకి దిగుతున్నాయని అంటున్నాయి. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం.

