telugu navyamedia
ఆంధ్ర వార్తలు ఉద్యోగాలు రాజకీయ వార్తలు

టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్ కు ధన్యవాదాలు, సన్‌రైజ్ రాష్ట్రానికి స్వాగతం: మంత్రి లోకేశ్‌

ప్రముఖ టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్ తమ భవిష్యత్తు కార్యకలాపాలకు విశాఖపట్నం నగరాన్ని ప్రధాన కేంద్రంగా ఎంచుకోవడం పట్ల రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కాగ్నిజెంట్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న సంస్థలకు తమ ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని ఆయన అన్నారు.

తమ కార్యకలాపాల విస్తరణలో భాగంగా విశాఖపట్నాన్ని కీలక కేంద్రంగా ఎంచుకున్న కాగ్నిజెంట్ నిర్ణయంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు.

“తమ భవిష్యత్తు కార్యకలాపాలకు విశాఖను ప్రధాన కేంద్రంగా ఎంచుకున్న కాగ్నిజెంట్‌కు ధన్యవాదాలు. సన్‌రైజ్ రాష్ట్రానికి స్వాగతం” అంటూ ఆయన తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

రాష్ట్ర యువతలో నూతన ఆశలు రేకెత్తిస్తూ, వారిలో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేసేలా కాపులుప్పాడలో కాగ్నిజెంట్ అత్యాధునిక క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుండటం శుభపరిణామమని మంత్రి లోకేశ్‌ అన్నారు.

సీఎం చంద్రబాబు దార్శనిక నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి ఆవిష్కరణలకు కేంద్రంగా, యువతకు ఉపాధి కల్పించే శక్తి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేశ్ స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రజలకు మెరుగైన అవకాశాలు కల్పించడం ద్వారా వారి భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహిస్తూ, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు.

రానున్న రోజుల్లో మరిన్ని సానుకూల ఫలితాలు సాధిస్తామన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాగ్నిజెంట్ రాకతో విశాఖ ఐటీ రంగంలో మరింత అభివృద్ధి చెందుతుందని, స్థానిక యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Related posts